- సిద్ధార్‌థజైన్‌కు సభా హక్కుల నోటీసులు ఇస్తాం
- ఐఏఎస్సా? లేక టీడీపీ వారికి ‘అయ్యా ఎస్సా?’
- నిబంధనలు పాటించకుంటే మంత్రుల పర్యటనను అడ్డుకుంటాం
- ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరిక
తిరుపతి రూరల్: జిల్లా పరిపాలనాధికారిగా కాకుండా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కార్యదర్శిలా జిల్లా కలెక్టర్ సిద్ధార్‌థజైన్ వ్యవహరిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. అత్యున్నత ఐఏఎస్ చదివిన సిద్ధార్‌థ జైన్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారన్నారు.
ఆయన ఐఏఎస్‌లా కాకుండా టీడీపీ కార్యకర్తలకు ‘అయ్యా ఎస్’ అనే స్థాయికి కలెక్టర్ పదవిని దిగజార్చుతున్నారని చెవిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. అధికారిక కార్యక్రమాలను సైతం టీడీపీ కార్యక్రమంలా మార్చుతున్నారని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో గత 10 రోజుల్లో చాలా అధికారిక కార్యక్రమాలు జరిగాయని, ఇందులో మంత్రులతో పాటు అధికారిక ప్రముఖులు, వీఐపీలు పాల్గొన్నారన్నారు. కానీ స్థానిక శాసనసభ్యులైన తనకు మాత్రం కలెక్టర్ సమాచారం ఇవ్వలేదన్నారు.
ప్రభుత్వం జారీచేసిన జీవో ఎంఎస్ నెం.348 ప్రకారం ఏదైనా నియోజకవర్గంలో అధికార కార్యక్రమాలు జరిగినా, మంత్రులు, వీఐపీలు పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడికి కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నట్టు ఆయన చెప్పారు. కానీ జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యుల విషయంలో కలెక్టర్ ప్రోటోకాల్‌ని పాటించడం లేదని తెలిపారు. కలెక్టర్ తీరు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఆయనకు సభా ఉల్లంఘన నోటీసు ఇస్తామని, అసెంబ్లీ ముందు దోషిగా నిలబెడ తామని హెచ్చరించారు. ప్రోటోకాల్ పాటించకుంటే శాసనసభ్యుల హక్కుకు భంగం కలిగించే ఏ అధికారినీ వదలమన్నారు.
మంత్రులనూ అడ్డుకుంటాం
ప్రోటోకాల్ పాటించకుంటే నియోజకవర్గాలకు వచ్చే మంత్రులను ఎక్కడికిక్కడ ప్రజలతో కలసి అడ్డుకుంటామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే అధికారిక కార్యక్రమాలవద్ద ఎలాంటి సంఘటనలు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉం టుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి చిన్నియాదవ్, చంద్రగిరి మండల కోఆప్షన్ మెంబర్ మస్తాన్, వాసు, సునీల్, గజ, ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు.