తహసీల్దార్ భారతి,ఆర్‌ఐ గోపి
చిత్తూరు కలెక్టరేట్: వెదురుకుప్పం తహసీ ల్దార్ భారతిని విధుల నుంచి సస్పెండ్‌చేస్తూ కలెక్టర్ ప్రద్యుమ్న మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మండలంలోని ఆళ్లమడుగు గ్రామపరిధిలో 26 ఎకరాల డీకేటీ, కాలువ పోరంబోకు స్థలాన్ని ఎలాంటి రికార్డులు లేకుండానే ఆన్‌లైన్‌లో ఇతరుల పేరున నమోదు చేసి, పట్టాదారు పాసుపుస్తకాలుమంజూరు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. దీనికి కారకులైన తహసీల్దారుతో పాటు ఆర్‌ఐ గోపి, వీఆర్వో మురళిని కూడా సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
మండల పరిధిలోని ఆళ్లమడుగు గ్రామ లెక్కదాఖలాలో సర్వే నం.505, 507లో 26 ఎకరాల డీకేటీ, కాలువ పొరంబోకు స్థలం ఉంది. ఆ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన సరోజమ్మకు సర్వే నం. 505–1లో 4.32 ఎకరాలు, లావణ్యకు 505–2లో 4.49 ఎకరాలు, పిత్రశ్రీకి 505–3లో 4.43 ఎకరాలు, నిర్మలకు 505–4 లో 4.44 ఎకరాలు, జ్యోతికి 507–5 లో 4.77 ఎకరాలు, హైమావతికి 505–7లో 4 ఎకరాల మేర ఎలాంటి రికార్డులూ లేకుండానే రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో 1బీ, అడంగళ్‌లో నమోదుచేసి, పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. ఈ భూములను పొందిన రైతులు అందులో మామిడి చెట్లు సాగు చేసుకుంటున్నారు.
ఇటీవల వారు ఆ భూములపై రుణం పొందేందుకు బ్యాంకర్లను ఆశ్రయించారు. దీనిపై బ్యాంకర్లు పరిశీలనలు జరపడంతో అసలు విషయం బయటపడింది. ఇంతలో గ్రామస్తులు కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ చిత్తూరు ఆర్డీఓ కోదండరామిరెడ్డిని పరిశీలన అధికారిగా నియమించారు. ఆయన ఆ భూములపై పరిశీలన చేపట్టగా ఎలాంటి రికార్డులు లేకుండానే పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయడం, ఆన్‌లైన్‌లోని 1బి, అడంగళ్‌లో నమోదు చేసినట్లు తేలింది. ఈ మేరకు కలెక్టర్ తహసీల్దారు, ఆర్‌ఐ, వీఆర్‌ఓలను సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment