
ఏలూరు కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలు దేరిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు
ఏలూరు (వన్‌టౌన్): దైవంతో సమానమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులపై కలెక్టర్ అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్‌ను సరెండర్ చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలో ఉపాధ్యాయుల జెఏసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. ఈ నెల 19న విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఉపాధ్యాయులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జిల్లా ఉపాధ్యాయ జెఏసీ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని మునిసిపల్ కార్యాలయం నుంచి వసంతమహల్, ఓవర్‌బ్రిడ్జి, ఫైర్‌స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన చేశారు.
అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జీ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఎక్కడాలేని విధంగా స్థానిక కలెక్టర్ కాటంనేని భాస్కర్ అనేక పనులు పురమాయిస్తూ ఉపాధ్యాయులను బోధనేతర పనులతో వేధించడమే కాకుండా గురువారం విద్యాశాఖ సమీక్ష పేరుతో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడం నిత్యకృత్యమైందన్నారు.
ఏప్రిల్ 19న జరిగిన సమీక్షలో ఉపాధ్యాయులను కదిలే శవాలుగా మారవద్దని, నీతిలేని ఉపాధ్యాయులు పిల్లలకు నీతి కథలు ఎలా చెబుతారని, హక్కుల కోసం పోరాడే ఉపాధ్యాయులు ఉన్నంత వరకు విద్యావ్యవస్థ ఇలాగే ఉంటుందని చేసిన వ్యాఖ్యలను రాతపూర్వకంగా పంపించిన నోటీసును తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లి కలెక్టర్‌పై చర్యలకు పట్టుబడతామని, చర్యలు తీసుకోని పక్షంలో ఫ్యాప్టోగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి.
సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు మంతెన సీతారామ్, బండి వెంకటేశ్వరరావు, యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇంతవరకు జిల్లాలో పని చేసిన ఏ కలెక్టర్ కూడా నియంతలా, అప్రజాస్వామికంగా పని చేయడం చూడలేదని కలెక్టర్ భాస్కర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ ఆర్‌ఎన్ హరనాథ్ మాట్లాడుతూ కలెక్టర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఉపాధ్యాయులనే కాకుం డా వివిధ శాఖల సమీక్షలో సంబంధిత ఉద్యోగులపై కూడా ఆయన అవమానకర వ్యాఖ్య లు చేస్తున్నారని వారు విరుచుకుపడ్డారు.
తక్షణమే కలెక్టర్ ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని జిల్లా ఉపాధ్యాయ జేఏసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ కలెక్టర్ ఉపాధ్యాయులనే కాకుండా అంగన్‌వాడీ టీచర్లను, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, కార్మికులను కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌ను జిల్లా నుంచి సాగనంపే వరకు ఉద్యమాలు తీవ్రం చేస్తామని ఆయన హెచ్చరించారు.
వివిధ సంఘాల నాయకులు కె.నరహరి, జి.నాగేశ్వరరావు, గుంపుల వెంకటేశ్వరరావు, కె.రాజ్‌కుమార్, జి.వెంకటేశ్వరరావు, టి.రాజబాబు,ఆర్.ధర్మరాజు, పి.ఆంజనేయులు, ఎన్.శ్రీనివాసరావు, జి.సుధీర్, ఆర్వీఎం శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment