కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్ : కలెక్టర్ వీరబ్రహ్మయ్య శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన తలనొప్పి, వాంతులతో బాధపడ్డారు. మెదడు నరం చిట్లి సమస్య తలెత్తినట్టు తేలడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. రోజులాగే శుక్రవారం ఉదయం నిద్రలేచిన కలెక్టర్ నీరసంగా ఉన్నట్టు కనిపించారు. ఉదయం 8 గంటలకు అకస్మాత్తుగా తీవ్ర తలనొప్పితో వాంతులు చేసుకున్నారు. సిబ్బంది సమాచారం మేరకు వైద్యులు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకునే సరికే నీరసంతో పడిపోయారు. కుడి వైపు కాలు, చేయి మొద్దుబారి బలం కోల్పోయినట్లు గుర్తించారు. దీంతో తక్షణమే నగరంలోని అపోలో రీచ్ ఆస్పత్రిలో చేర్పించారు.
సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షల్లో మెదడులో సన్నని నరం చిట్లిపోయి రక్తస్రావం అయినట్లు తేలిందని వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం కలెక్టర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కొమురం బాలు, అపోలో రీచ్ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎనమల్ల నరేశ్ తెలిపారు. కలెక్టర్‌కు గత నెలలోనే అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి వైద్యుల సూచనమేరకు మందులు వాడుతున్నారు.
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. తగినంత విశ్రాంతి లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. శుక్రవారం అపోలో రీచ్‌లో కలెక్టర్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాక ర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్‌కు తీవ్ర అస్వస్థత
Published Sat, Nov 30 2013 4:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement