
నిమిషం ఆలస్యమైందని అనుమతించ లేదు
హైదరాబాద్ : ఎంసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైందని ఓ విద్యార్థినిని పరీక్ష రాసేందుకు అధికారులు శుక్రవారం కూకట్పల్లిలోని ఎంఎన్ఆర్ కాలేజీలోకి అనుమతించ లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కాలేజీకి వచ్చేందుకు ఆలస్యమైందని సదరు విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీ అధికారులకు తెలిపారు. నిమిషం దాటిపోయిందని... కావున విద్యార్థిని పరీక్ష రాసేందుకు అనుమతించమని కాలేజీ అధికారులు వెల్లడించారు. దాంతో ఆగ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు... అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
అయినా అధికారులు ససేమిరా అనడంతో కాలేజీ ఎదుట విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ పరీక్ష కోసం తాను పడిన కష్టం అంతా బుడిదలో పోసిన పన్నీరుగా మారిందని విద్యార్థిని కన్నీరుమున్నీరవుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చిన పర్వాలేదని ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ నిమిషం కూడా పూర్తి కావడంతో అధికారులు విద్యార్థిని అనుమతించలేదు.