సాక్షి, కడప: చాపాడు పీహెచ్‌సీలో ఎనిమిది నెలలుగా ల్యాబ్‌టెక్నీషియన్ లేరు. వనిపెంట పీహెచ్‌సీలో పనిచే స్తున్న తస్లీం బాషా అనే టెక్నీషియన్‌ను డిప్యుటేషన్‌పై నియమించారు. ఇతను సోమ, బుధ, శుక్రవారాల్లో చాపాడు పీహెచ్‌సీలో అందుబాటులో ఉండాలి. తక్కిన రోజుల్లో రోగులు వస్తే పరీక్షలు చేసే అవకాశం ఉండదు.
టెక్నీషియన్ ఉన్నరోజు వస్తే శాంపుల్స్ తీసుకున్న తర్వాత రెండ్రోజులకు రావాలని రోగులకు ఉచిత సలహా ఇస్తారు. జ్వరం వచ్చిన వారు ఈ రెండు రోజులు ఉండలేక సర్కారు వైద్యానికి స్వస్తి చెప్పి ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ల్యాబ్‌టెక్నీషియన్ల ఖాళీలపై ఇటీవల ప్రభుత్వానికి పంపిన నివేదికలో చాపాడులో టెక్నీషియన్ ఉన్నాడని డీఎంఅండ్‌హెచ్ పేర్కొనడం గమనార్హం.
జిల్లాలోని 70 శాతం పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయి ల్యాబ్‌టెక్నీషియన్లు అందుబాటులో లేరు. పీహెచ్‌సీల్లో ఉన్న టెక్నీషియన్లను ఖాళీలు ఉన్న మరొక పీహెచ్‌సీకి డిప్యుటేషన్లు వేశారు. దీంతో ఒక్కో పీహెచ్‌సీలో రెండ్రోజులు మాత్రమే వారు అందుబాటులో ఉంటున్నారు. దీనివల్ల ఏ పీహెచ్‌సీ పరిధిలోని రోగులకు న్యాయం జరగడం లేదు. జ్వరాలతో పోటు ఏ చిన్నరోగం వచ్చినా రక్త, మూత్ర పరీక్షలు తప్పనిసరిగా మారుతోంది. రోగులు పీహెచ్‌సీకి వెళితే ‘ల్యాబ్‌టెక్నీషియన్ లేరు. రెండురోజుల తర్వాత రండి’ అని నాలుగు మాత్రలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. దీంతో పీహెచ్‌సీలకు వెళ్లడమే రోగులు మానుకున్నారు.డబ్బులు లేకపోతే అప్పులు చేసైనా సరే ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు.
వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత ..:
జిల్లాలో 72 పీహెచ్‌సీ(ప్రెమరీ హెల్త్ సెంటర్)లు ఉన్నాయి. 448 సబ్‌సెంటర్లు ఉన్నాయి. 24 గంటలూ పనిచేసే ఆస్పత్రులు 34 ఉన్నాయి. వీటితో పాటు కడప సెంట్రల్‌జైలు, మలేరియా జోనల్‌కార్యాలయం, టీబీ కంట్రోలు ఆఫీసు తదితర వాటిల్లో కలిపి అధికారుల లెక్కప్రకారం జిల్లాలో 91 మంది ల్యాబ్‌టెక్నీషియన్లు ఉండాలి. అయితే 64మంది టెక్నీషియన్లు ఉన్నారని, 27 ఖాళీలు ఉన్నాయని డీఎంఅండ్‌హెచ్‌ఓ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఉన్నవారిలో 33మంది రెగ్యులర్, 31మంది కాంట్రాక్టు సిబ్బంది. వీరిలో 10మంది కడపలోని ప్రధాన కార్యాలయాల్లో ఉన్నారు. దీంతో జిల్లాలోని 51 మండలాల్లోని 37 పీహెచ్‌సీల్లో టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది. ఈ పీహెచ్‌సీల పరిధిలోని రోగులు ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రులను ఆశ్రయించడంతో చిన్నరోగానికి కూడా వందలరూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. పీహెచ్‌సీల్లో టెక్నీషియన్లు అందుబాటులో ఉంటే పరీక్షలకు డబ్బు లేకపోవడంతో పాటు చికిత్స కూడా ప్రభుత్వ వైద్యులే పర్యవేక్షించే అవకాశం ఉంది.
ఫార్మసిస్ట్‌ల కొరత కూడా అదేస్థాయిలో:
ఫార్మాసిస్టుల కొరత కూడా అదేస్థాయిలో వేధిస్తోంది. జిల్లాలో 79మంది ఫార్మాసిస్టులు ఉండాలి. అయితే 56మంది ఉన్నారు. 23 పీహెచ్‌సీల్లో ఫార్మాసిస్టులు లేరు. ఉన్నవారిలో 52మంది రెగ్యులర్ సిబ్బంది. తక్కినవారు ఔట్‌సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. ఖాళీలు ఉన్నచోట స్టాఫ్ నర్సులే మందులు ఇస్తున్నారు. కొన్నిసార్లు ఏ రోగానికి ఏమందులు ఇవ్వాలో తెలీక నర్సులు ఇబ్బంది పడుతున్నారు.
మధాహ్నం దాటితే వైద్యసేవలు బంద్:
ఉదయం 9-12 గంటల వరకూ ఓపీ సమయం ఉంటే చాలా చోట్ల 10.30 గంటల వరకూ డాక్టర్లు రాని పరిస్థితి. పైగా మధ్యాహ్నం 12 గంటలకే వారు ఇంటిదారి పడుతున్నారు. మధాహ్నం నుంచి సాయంత్రం 4గంటల వరకూ నర్సులు మాత్రమే ఆస్పత్రిలో ఉంటారు. ఈ సమయంలో జ్వరం వచ్చిందని రోగులు ఆస్పత్రులకు వెళితే మాత్రలు చేతిలో పెట్టడం లేదంటే ఇంజక్షన్ వేస్తున్నారు. దీనికి కూడా నీడిల్, సిరంజి బయట నుంచి రోగులు తెచ్చుకోవల్సిన పరిస్థితి. ఈ విషయాలన్నీ స్పష్టం తెలిసినా ప్రక్షాళన చర్యలు చేపట్టడంలో ఉన్నతాధికారులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు.
రేపు రా..
Published Mon, Feb 17 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement