
ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నులశాఖ ఉన్నతాధికారి
వాణిజ్య పన్నులశాఖలో ఓ ఉన్నతాధికారి మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు దొరికిపోయారు. వాణిజ్య పన్నులశాఖ హైదరాబాద్ రూరల్ డిప్యూటీ కమిషనర్ నీలకొట్టం శ్రీనివాసులు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి పలు అక్రమ ఆస్తులు గుర్తించారు. శ్రీనివాసులు అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు హైదరాబాద్ వింగ్ ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో కలిసి బల్కంపేటలోని ఆయన నివాసంతోపాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిపారు.
అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ. 4 కోట్ల మేరకు అక్రమ ఆస్తులు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు హైదరాబాద్, కర్నూల్, మహబూబ్‌నగర్‌లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఎస్‌ఆర్‌నగర్ భేరీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న శ్రీనివాసులు ఫ్లాట్‌లో రూ. 20.5 లక్షల నగదు, 89 గ్రాముల బంగారు ఆభరణాలు, వెంగళరావునగర్‌లో ఓ ఫ్లాటు, వైదేహినగర్‌లో 311 గజాల స్థలం.. జడ్చర్ల, వనపర్తిలో 28.5 ఎకరాల భూమి, జీ ప్లస్ టూ భవనం, అప్పాయిపల్లిలో 10 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. శ్
రీనివాసులుకు చెందిన ఆంధ్రాబ్యాంకు ఖాతాలో రూ. 1.98 కోట్ల నగదు ఉందని, బ్యాంకు లాకర్లలను తెరవాల్సి ఉందన్నారు. భార్య కళావతి, సోదరులు తిరుమలేశ్, వెంకట్‌రాం, తల్లి శంకరమ్మ, అత్త మహదేవమ్మ, మామ మహదేవ్‌ల పేర్లతో శ్రీనివాసులు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు డీఎస్పీ వివరించారు.