ఇంగ్లిష్‌ మీడియంపై పేదల వాదనా వినండి | Committee of School Parents seeking AP High Court About English Medium | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ మీడియంపై పేదల వాదనా వినండి

Published Wed, Feb 5 2020 4:33 AM | Last Updated on Wed, Feb 5 2020 4:33 AM

Committee of School Parents seeking AP High Court About English Medium - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తున్నామని విజయవాడలోని జక్కంపూడి ఎంపీపీ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని ఆ కమిటీ ఎక్స్‌ అఫిషియో సభ్యురాలు బి.శ్వేతా భార్గవి హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి తమ వాదనలూ వినాలని కోరుతూ ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. ఇంగ్లిష్‌ మీడియం ఉన్న ప్రైవేటు స్కూళ్లలో భారీ ఫీజులు చెల్లించి, తమ బిడ్డలను చదివించేంత స్థోమత తమకు లేదని, అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తాము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పారు. ఎస్టీ కులానికి చెందిన తాను ఇంగ్లిష్‌ మీడియంలో    మిగతా 2వ పేజీలో u

చదివే స్థోమత లేక తెలుగు మీడియంలోనే విద్యాభ్యాసం కొనసాగించానని, ఉన్నత చదువుల సమయంలో ఇంగ్లిష్‌ రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని శ్వేతా భార్గవి వివరించారు. ఇంగ్లిష్‌ రాక ఎంతో మానసిక వేదన అనుభవించానని చెప్పారు. అనేక ఉద్యోగావకాశాలను కూడా కోల్పోయానని పేర్కొన్నారు. సామాజిక వివక్ష కూడా ఎదుర్కొన్నానని, చిన్నప్పటి నుంచి సరైన పునాది లేకపోవడం వల్ల ఇంగ్లిష్‌ను పూర్తి స్థాయిలో నేర్చుకోలేకపోయానని చెప్పారు. 

ప్రైవేట్‌ పాఠశాలల్లో గుబులు
ప్రస్తుత ప్రపంచీకరణలో ఇంగ్లిష్‌ విశ్వభాషగా మారిపోయిందని శ్వేతా భార్గవి తెలిపారు. ప్రతి దశలో, ప్రతి చోట ఇంగ్లిష్‌ అవసరం చాలా ఉందని, అందుకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారని వివరించారు. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివి, ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియంలో చదవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, దీంతో ఆయా సబ్జెక్టులు సులభంగా అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి పరిష్కారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేయడమేనన్నారు. అటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం లేక, ఇటు ప్రైవేటు పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేక పేద పిల్లలు సతమతమైపోతున్నారని ఆమె వివరించారు. దీనికి మందుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఉత్తర్వులని, ఈ ఉత్తర్వుల వల్ల ప్రైవేటు పాఠశాలల్లో గుబులు మొదలైందని, ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తూ దాఖలైన ఈ వ్యాజ్యాల వెనుక ఆ పాఠశాలలే ఉన్నాయని ఆమె ఆరోపించారు. 

పేద పిల్లల తల్లిదండ్రుల వాదనలు వినండి
పేదల పిల్లలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం ఓ వరం అని శ్వేతా భార్గవి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయం వల్ల పేద పిల్లలంతా లబ్ధి పొందుతారని, అందువల్ల ఈ విషయంలో న్యాయస్థానం ఎటువంటి వ్యతిరేక ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు. ఈ వ్యవహారంలో తమ వాదనలు కూడా వినాలని, అందువల్ల తమనూ ఈ వ్యాజ్యంలో ఇంప్లీడ్‌ చేసుకోవాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం గురించి తల్లిదండ్రుల కమిటీ తరఫు న్యాయవాది మహేష్‌ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇంగ్లిష్‌ మీడియం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై కూడా ఆ రోజు వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement