సాక్షి, హైదరాబాద్: ఇటీవలి బస్సు ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీ వాహనాలుగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులన్నింటినీ వెంటనే నిలిపేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జె.కె.రాజు... నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు బస్సు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. అలాగే బస్సుల్లో వేగ నిరోధకాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరుతూ మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ వ్యాజ్యాలన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. పరిహారం విషయం అడగొద్దని, ఆ విషయంలో తాము ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇక వేగనిరోధకాలు, కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై విచారణ జరుపుతామని పేర్కొంటూ తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.