సాక్షి, అమరావతి: దళితుల వల్లే దరిద్రం అని అహంకారంగా మాట్లాడిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న చినకాకాని మహిళా ఎస్సై అనూరాధను ఉద్దేశించి అహంకారంగా మాట్లాడం సిగ్గుచేటన్నారు. గతంలో కూడా అనేక మంది ప్రజా ప్రతినిధులు దళితులపై రకరకాల పేరుతో అవమానకర వ్యాఖ్యలు చేశారని, వ్యంగ్యంగా మాట్లాడినా చర్యలు తీసుకున్న సందర్భాలు లేనందునే ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నారు. ఎస్సైకి తగిన రక్షణ కల్పించి, భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దిష్టిబొమ్మల దగ్ధం
తెనాలి : దళిత ఎస్‌ఐ విధులను ఆటంకపరుస్తూ ‘దళితుల వలన ఈ దరిద్రం పట్టింది’ అంటూ దళితులను కించపరచేలా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలకు నిరసనగా, దీనిని ఖండించని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్ దిష్టిబొమ్మలను పట్టణ గాంధీచౌక్‌లో గురువారం దహనం చేశారు. టీడీపీ పల్నాడులో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం, న్యాయవిభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లాలోని పెదకాకాని ఎస్‌ఐ అనూరాధ విధుల్లో ఉండగా, నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి వనితలు పరుష పదజాలంతో దూషించి దళితుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం వినతిపత్రాన్ని మండల తహసీల్దార్, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో అందజేశారు. పార్టీ ఎస్సీ విభాగం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు కనపర్తి అనిల్, రాష్ట్ర కార్యదర్శి కె.దేవయ్య, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేఎం విల్సన్, డి.మల్లికార్జునరెడ్డి, జె.ఎలిజబెత్ రాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాదరావు, కొమ్ము రాయల్ పాల్గొన్నారు.
దళితులకు క్షమాపణ చెప్పాలి
తెనాలి టౌన్ : దళిత ఎస్‌ఐ విధులకు ఆటకం కలిగిస్తూ ఆమెను కించపరిచే విధంగా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాదిగ కార్పొరేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రావూరి రవిబాబు (జెవీఆర్) గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. రాజకుమారి దళితులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దేవయ్య డిమాండ్ చేశారు.
రాజకుమారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
మహిళా ఎస్‌ఐని అవమానించిన మహిళా కమిషన్ రాష్ట్ర మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కంతేటి యలమందరావు డిమాండ్ చేశారు. గురువారం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీఐ యు.శోభన్‌బాబును కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్‌ఐపై రాజకుమారి బృందం వేలు చూపిస్తూ అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం ప్రతినిధులు కుక్కల రాంప్రసాద్, కూరపాటి సరస్వతి, బెజ్జం గోపి, బండి ప్రసాద్, బండ్లమూడి బానుకిరణ్, పాటిబండ్ల విల్సన్‌బాబు తదితరులు ఉన్నారు.
ఆళ్లమూడిలో నిరసనలు
భట్టిప్రోలు: నన్నపనేని రాజకుమారి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భట్టిప్రోలు మండలం ఆళ్లమూడి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతర రాజకుమారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం కార్యదర్శి పంతగాని బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సాటి మహిళ అని చూడకుండా పెదకాకాని మహిళా ఎస్‌ఐ అనూరాధపై దుర్భాషలాడటం విచారకరమన్నారు. కార్యక్రమంలో నాంచారయ్య, ప్రవీణ్‌కుమార్, వెంకట్రావు, అశోక్, ప్రశాంత్‌రాజ్, చంటి పాల్గొన్నారు. పెదపులివర్రు పంచాయతీ పరిధిలోని కోళ్లపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో నాగరాజు, చీకటి నాగేశ్వరరావు, బుస్సా మణేశ్వరరావు, ఎన్ నాగరాజు, దోవా సంసోన్, సూర్యచంద్రరరావు పాల్గొన్నారు. రాజకుమారి ఇలా మాట్లాడటం సరికాదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మహిళా ఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. (చదవండి: నోరు పారేసుకున్న నన్నపనేని)
Comments
Please login to add a commentAdd a comment