సంపూర్ణ తెలంగాణే లక్ష్యం | Complete Telangana Playing | Sakshi
Sakshi News home page

సంపూర్ణ తెలంగాణే లక్ష్యం

Published Sun, Jan 5 2014 4:00 AM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM

Complete Telangana Playing

 నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: సంపూర్ణ తెలంగాణ సాధన కోసం ఈ ప్రాంత ప్రజలంతా కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న దీక్షకు సన్నాహకంగా శనివారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంపూర్ణ తెలంగాణ సాధన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని, సంపూర్ణ తెలంగాణకు బిల్లులో సవరణలు చేయాలని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఐదేళ్లలోపు ఉంచాలని, శాంతి భద్రతల అంశాన్ని తెలంగాణ పరిధిలోనే ఉంచాలనేది జేఏసీ ప్రధాన డిమాండ్లని వివరించారు.

 ఓట్ల కోసమే సభలో ఆం ధ్రా నాయకులంతా గందరగోళం చేస్తున్నారన్నారు. తెలంగాణ విభజనతోనే హైకోర్టును విభజించాలన్నారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలన్నారు. నీటి పంపిణీకి జలబోర్డు, ఎథెక్స్‌లు వేయాలన్నారు. కొత్త ప్రాజెక్టులకు అనుమతిచ్చే అధికారం జలబోర్డుకు ఉండకూడదన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను విడివిడిగా నిర్వహించాలన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే సంపూర్ణ తెలంగాణ సాధన సభకు హాజరై విజయవంతం చేయాలన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీష్‌రావు మాట్లాడుతూ టీవీల ముందు.. సభలలో తొడలుకొట్టిన సీమాంధ్రులు అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు భయపడి అడ్డుకుంటున్నారన్నారు. అసెంబ్లీ పూర్తిగా రియాలీటీ షోని తలపిస్తోందన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ వస్తుందని స్పష్టం చేశారు.

పోరాటాల ద్వారానే భద్రాచలాన్ని సాధించుకున్నామన్నారు. సభలల్లో తెలంగాణ ఏర్పాటుతో నష్టమన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. సాక్ష్యాలతో అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. జేఏసీ అధికార ప్రతినిధి విఠల్ మాట్లాడుతూ విభజన వల్ల ఆంధ్రాకు ట్రైబల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఎయిమ్స్, రైల్వే జోన్, వరంగల్ నిట్ తరహాలోనే మరో నిట్ కాలేజీని కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. బిల్లులో ప్రమాదకరమైన అంశాలు ఉన్నప్పటికీ అంశాల గురించి మాట్లాడితే ఏదోరకమైన అడ్డు చెప్పి తెలంగాణను ఆపుతుందన్న ఉద్దేశంతోనే ఎలాంటి అభ్యంతరాలూ చెప్పడం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిల్లులోని లోపాలను సవరించుకుంటామన్నారు. 371డి ఆర్టికల్‌ను ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ గందరగోళం చేస్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే బీజేపీ ఇస్తుందన్నారు.

టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంక్షలు లేని తెలంగాణ సాధించేందుకు టీఆర్‌ఎస్ పోరాటం నిర్వహిస్తుందన్నారు. మళ్లీ కిరికిరి పెట్టి తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్ర చేస్తున్నారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణను అడ్డుకుంటే పుట్టగతులుండవని, నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు చేస్తారన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ యురేనియం, థర్మల్‌ప్లాంట్, ఫీల్డ్‌ఫైరింగ్ రేంజ్ ఏర్పాటును వ్యతిరేకించాలన్నారు. టీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వరమూర్తి మాట్లాడుతూ ఆంక్షలు లేని తెలంగాణ కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణవాదులంతా భాగస్వామ్యం కావాలని కోరారు. జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ గోలి అమరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యురో సభ్యులు చెరుకు సుధాకర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చకిలం అనిల్‌కుమార్, గెజి టెడ్ అధికారుల సంఘం నాయకులు గంప మోహన్‌రావు పాల్గొన్నారు. అనంతరం టీఆర్‌టీయూ క్యాలెండర్‌ను కోదండరాం, హరీష్‌రావులు ఆవిష్కరించారు. అంతకుముందు సభలో కళాకారులు ఆటా - పాటలు అలరించాయి. మర్రిగూడం బైపాస్ వరకు టీఆర్‌ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement