
వీబీఆర్ అంత్యక్రియలు పూర్తి
అశ్రునయనాల మధ్య సాగిన రాజేంద్రప్రసాద్ అంతిమయాత్ర
హైదరాబాద్: ప్రముఖ దర్శక, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఎస్‌ఆర్ నగర్ హిందూ శ్మశానవాటికలో జరిగాయి. పెద్ద సంఖ్యలో అభిమాను లు, సినీ ప్రముఖులు వెంటరాగా వీబీ అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య కొనసాగింది. కడసారిగా వీబీ భౌతికకాయాన్ని చూసేందుకు ఆయన అభిమానులు, జగపతిబాబు అభిమానులు శ్మశానవాటికకు చేరుకున్నారు. ఆయన పెద్ద కుమారుడు రామ్‌ప్రసాద్ తండ్రి చితికి నిప్పంటించారు. రాజేంద్రప్రసాద్ రెండో కుమారుడు యుగంధర్‌కుమార్, మూడో కుమారుడు, సినీ హీరో జగపతిబాబు హిందూ సంప్రదా యం ప్రకారం తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. అంతకుముందు అభిమానులు, చిత్ర ప్రముఖుల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. ఆ తర్వాత ఫిలింఛాంబర్‌కు తరలిం చారు.
సినీ ప్రముఖులు చిరంజీవి, కె.రాఘవేంద్రరావు, జయసుధ, మా అధ్యక్షుడు మురళీమోహన్, ఎస్వీ కృష్ణారెడ్డి, మోహన్‌బాబు, పరుచూరి గోపాలకృష్ణ, వీవీ వినాయక్, అశ్వనీదత్, కాదంబరీ కిరణ్, ఆర్.నారాయణమూర్తి, డి.రామానాయుడు, సురేశ్ బాబు, బోయపాటి శ్రీను, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, సి.కల్యాణ్, అశోక్‌కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు తేజ, హీరో అర్జున్, రమేశ్ ప్రసాద్, హీరో సుమంత్, వెంకటేశ్, సందీప్‌కిషన్, జీవిత రాజశేఖర్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు వీబీ భౌతికకాయానికి నివాళులర్పించారు.