పక్కా వ్యూహం.. ఒడిశా సొంతం
* విపత్తు నష్టాల కట్టడిలో అందరికీ ఆదర్శం
* 1999 సూపర్ సైక్లోన్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందడుగు
* నష్ట నివారణకు ప్రతిసారీ ముందస్తు చర్యలు
* విపత్తుల నిర్వహణకు సమగ్ర విధానం
* పంచాయతీ నుంచి ప్రభుత్వం వరకు అందరికీ బాధ్యత
* ఆపత్కాలంలో మూడు దశల వ్యూహం అమలు
సాక్షి, విజయవాడ బ్యూరో: విపత్తుల సమయాల్లో ఆస్తి, ప్రాణ నష్టాలను నియంత్రించడం, ప్రజలను పరిమిత ఇబ్బందులతో గట్టెక్కించడం అనేవి ప్రభుత్వాలు అనుసరించే విపత్తు నిర్వహణ విధానాలపైనే ఆధారపడి ఉంటాయి. ఈనెల 12వ తేదీన సంభవించిన హుదూద్ తుపానుకు సంబంధించి నష్ట నివారణ కోసం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ముందస్తు నష్ట నివారణ చర్యలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. అతి చిన్న రాష్ట్రం, మౌలిక వసతుల్లో మనతో ఏమాత్రం సరితూగలేని ఒడిశా విపత్తు నష్ట నివారణ చర్యల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ కంటే చాలా ముందుందని ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాటిచెబుతున్నాయి.
14 జిల్లాల్లో పదివేల మందిని పొట్టన పెట్టుకున్న 1999 సూపర్ సైక్లోన్ అనుభవం నుంచి ఒడిశా ప్రభుత్వం నేర్చుకున్న పాఠాలు, అనుసరిస్తున్న సమగ్ర విపత్తు నివారణ చర్యలు ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా మార్చాయి. గత ఏడాది పైలీన్, తాజా హుదూద్ తుపాన్ల సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని అనేక ముందు జాగ్రత్త చర్యలను ఒడిశా ప్రభుత్వం తీసుకోవడమే ఇందుకు నిదర్శనం. తుపాన్లు వచ్చే ముందు చెట్ల కొమ్మలు నరికేస్తే చెట్లు పడిపోకుండా ఉంటాయి. రవాణా వ్యవస్థకు అవరోధం ఉండదు. మొన్నటి హుదూద్‌కు ముందు ఒడిశా ప్రభుత్వం అదే చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మన ప్రభుత్వం ఆ పనిచేయలేదు.
మూడు దశల వ్యూహం...
విపత్తులను ఎదుర్కొనేందుకు మూడు దశల వ్యూహాన్ని పకడ్బందీ ప్రణాళికలతో ఒడిశాలో అమలు చేస్తున్నారు. తుపానుకు ముందు నష్టాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు (ప్రీ డిజాస్టర్ స్టేజ్), తుపాను వచ్చిన సమయంలో సన్నద్ధంగా ఉండి ఎదుర్కోవడం (రెస్సాన్స్ ఫేజ్), తుపాను తర్వాత పునరావాస, పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవడం. ఈ మూడు దశల్లోను స్థానిక పంచాయతీలు, ఎన్జీవోలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, రెడ్‌క్రాస్ తదితర అనేక సంస్థలను భాగస్వాముల్ని చేస్తున్నారు. వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే దానిపై స్థానిక ప్రజలతో మాక్ డ్రిల్స్ చేయిస్తున్నారు.
పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ అధికారులు, సిబ్బందితోపాటు వివిధ సంస్థల నుంచి వేలాదిమంది వాలంటీర్లను తయారు చేశారు. వారికి విపత్తుల సమయంలో ఒత్తిడిని తట్టుకునే శిక్షణ కూడా ఇస్తున్నారు. వీరి వివరాలతో ఒక డేటాబేస్ తయారు చేసి అవసరమైన సమయంలో వెంటనే రంగంలోకి దించుతున్నారు. ఈ విధానం ద్వారా థానే, నీలమ్, పైలీన్ వంటి తుపానులను ఒడిశా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొని నష్టాలను తగ్గించుకోగలిగింది.
మొన్నేం చేసిందంటే...
హుదూద్ తుపాను ఒడిశాలోని గోపాలపురం సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ పేర్కొనడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గంజాం, గజపతి, కలహండి, మల్కజ్‌గిరి, కోరాపుట్, రాయగడ, నవరంగ్‌పూర్ తదితర జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తుపాను గాలులకు చెట్లు నేలకూలే ప్రమాదం ఉన్నందున రహదారుల వెంబడి చెట్ల కొమ్మలను నరికించింది. దీనివల్ల చెట్లపై గాలి ప్రభావం తగ్గి అవి అలాగే ఉన్నాయి. తుపానుకు ముందే విద్యుత్తు సరఫరా నిలిపేసి ప్రజలకు టార్చిలైట్లు అందించింది. వీధిలైట్లన్నీ తీసి భద్రపరిచింది.
ప్రజలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా ముందుగానే అన్ని ప్రాంతాల్లో నీటి ట్యాంకులను పూర్తిగా నింపి సిద్ధంగా ఉంచింది. పిల్లలకు ఇబ్బంది లేకుండా టెట్రా పాలపొడి ప్యాకెట్లు, బిస్కెట్లు స్టాకు పెట్టింది. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా బంగాళా దుంపలు, ఉల్లిపాయలు ముందుగాానే నిల్వలు ఉంచింది. కరెంటు లేకపోయినా తుపానుకు సంబంధించి నిరంతరం తాజా సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ప్రతి ఇంట్లో రేడియో ఉంచుకునేలా ప్రజలను చైతన్య పరిచింది.
హుదూద్‌కు ముందు మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రలో ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. 1999లో సూపర్ సైక్లోన్ నష్టాల అనంతరం అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒడిశాలో నష్టాలను పరిశీలించి వచ్చారు. కానీ మన ప్రభుత్వం తర్వాత కూడా విపత్తులను ఎదుర్కొనేందుకు సమగ్రమైన ప్రణాళికలు రూపొందించలేదు. అందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని నిపుణుల మాట.