
అసెంబ్లీ సెషన్స్ కుదింపు!
- ఇక ఏడాదికి 26 రోజులే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను వీలైనంత మేరకు ఎక్కువ రోజులు నిర్వహించడం ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకాలని ఎవరైనా కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ సమావేశాలను వీలైనన్ని రోజులు కుదించాలన్న ఆలోచనతో ఉంది.
ఏడాదిలో కనీసంగా వంద రోజులకు తగ్గకుండా చట్టసభలు సమావేశమవ్వాలని అనేకసార్లు జరిగిన పార్లమెంటరీ ప్రిసైడింగ్ అధికారుల సమావేశాలు తీర్మానం చేయగా.. అందుకు విరుద్ధంగా వచ్చే బడ్జెట్ సమావేశాల రోజులను చాలావరకు కుదించాలని, అదే సమయంలో మొత్తం సమావేశాలను ఏడాదిలో 26 రోజులపాటు(మూడు దశల్లో జరిగే సమావేశాలన్నీ కలిపి) నిర్వహిస్తే సరిపోతుందన్న భావనకు రాష్ట్రసర్కారు వచ్చింది. ఇందులో భాగంగా వచ్చే బడ్జెట్ సమావేశాలను కేవలం 16 పనిదినాలకు కుదించాలని నిర్ణయించింది.
బడ్జెట్ సమావేశాలు మార్చి తొలి వారంలో ప్రారంభమవుతాయని, ఇవి 16 పనిదినాలుంటే సరిపోతాయని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏడాదికి 50 రోజులకుపైగా నిర్వహించాలని ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేసి.. ఇప్పుడు కేవలం 16 రోజులకే కుదించడం ఏమిటన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. చిన్న రాష్ట్రం అయిందని, ప్రతిపక్షం కూడా ఒక పార్టీయే ఉందని, ఎక్కువ పార్టీలు లేవుకదా! అని వ్యాఖ్యానించారు.
మార్చి 2 నుంచి బడ్జెట్ సమావేశాలు..
ఇదిలా ఉండగా మార్చి 2న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి 6న ఆర్థిక యంత్రి యనమల రామకృష్ణుడు 2015-16 ఆర్థిక సంవత్సరానికి జీరో స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మార్చి 27కల్లా బడ్జెట్ సమావేశాలను ముగించే వీలుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.