సాక్షి, అమరావతి: శాసనసభ సమావేశాల సందర్భంగా ఆరు బడ్జెట్ పద్దులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. గురువారం సభలో వ్యవసాయ–సహకార, పశు సంవర్థక–మత్స్య, పౌర సరఫరాలు, ప్రణాళిక–శాసన వ్యవహారాలు, గవర్నర్, కేబినెట్, జీఏడీ నిర్వహణ, సమాచార, ప్రజా సంబంధాలకు చెందిన పద్దులను ప్రవేశపెట్టారు. వీటిపై చర్చించిన అనంతరం మంత్రులు సమాధానం ఇచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం రైతులకు అండగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా ఖరీఫ్‌కు ముందస్తుగా సాగునీరు, వైఎస్సార్ రైతు భరోసాతో పెట్టుబడి సాయం అందించడం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అందిస్తున్నామన్నారు.
మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించని పంటలను ఎమ్మెస్పీకి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. టీడీపీ హయాంలో ఆక్వా జోన్ పరిధిలో 2.56 లక్షల ఎకరాలు, నాన్ ఆక్వా జోన్‌లో 1.90 లక్షల ఎకరాలు భూమి ఉందని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆక్వా జోన్‌లోకి 4.20 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు.
ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌కు సంబంధించి టీడీపీ సర్కారు రూ.309 కోట్ల రీయింబర్స్ పెండింగ్‌లో పెట్టగా, తమ ప్రభుత్వం వచ్చాక యూనిట్ రూ.1.50 చొప్పున సబ్సిడీ విద్యుత్ ఇస్తూనే పాత బకాయిలతో కలిపి రూ.2,687 కోట్లు ఖర్చు చేశామన్నారు. పాడి రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరు గేదె పాలపై రూ.20 లబ్ధి చేకూరుస్తున్నట్టు చెప్పారు. అమూల్ రేట్లు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ డెయిరీలు రేట్లు పెంచాల్సి వచి్చందని, ఆ మేరకు రైతులకు రూ.2,300 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల బిల్లుకు సభ ఆమోదం
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఏపీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల బిల్లు–2023కు గురువారం శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు.
బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి సురేశ్ తెలిపారు. సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు ప్రజలకు గ్రామ, వార్డు స్థాయిల్లోనే అందుతున్నాయన్నారు. ఇక సచివాలయాల బిల్లుతో పాటు మరో ఆరు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
సభ ఆమోదం పొందిన ఆరు బిల్లులు
♦ ఏపీ ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ (సవరణ) బిల్లు–2023
♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ఎస్టీ (సవరణ) బిల్లు–2023
♦ ఏపీ పబ్లిక్ సర్విసెస్ డెలివరీ గ్యారంటీ (సవరణ) బిల్లు–2023
♦ ఏపీ మున్సిపల్ లాస్ (సవరణ) బిల్లు–2023
♦ ఏపీ మున్సిపల్ లాస్ (రెండో సవరణ) బిల్లు–2023
♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) బిల్లు–2023
Comments
Please login to add a commentAdd a comment