కంప్యూటర్ విద్య మిథ్యే
జిల్లాలో 90 శాతం పాఠశాలల్లో ట్యూటర్లు కరువు
20 శాతానికిపైగా కంప్యూటర్లు చోరీ
ఉన్న కంప్యూటర్లు పనిచేయని వైనం
కొన్నింటిని సొంతానికి వాడుకుంటున్న టీచర్లు
నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
చిత్తూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. జిల్లాలో 309 పాఠశాలల్లో రూ.20కోట్లకు పైగా వెచ్చించి 3,399 కంప్యూటర్లను ప్రభుత్వం అందజేసింది. ఎవరాన్ కంపెనీ ద్వారా కంప్యూటర్ ట్యూటర్లను నియమించినా సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో వారు పత్తాలేకుండా పోయారు. 20 శాతానికి పైగా కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. 70 శాతం కంప్యూటర్లు మూల నపడ్డాయి. 10 శాతం కూడా పనిచేస్తున్న పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు సొంత పనులకు వాడుకుంటున్న పరిస్థితి. కంప్యూటర్ విద్య కోసం ఇచ్చిన జనరేటర్లు కొన్ని చోరీకి గురి కాగా, మరికొన్ని పనికిరాకుండా పోయాయి. మొత్తంగా ప్రభుత్వం చిత్తశుద్ధి లోపించడ మే అందుకు కారణమవుతోంది.
► నియోజకవర్గంలో 41 ఉన్నత పాఠశాలలుండగా, 24 పాఠశాలలకు 264 కంప్యూటర్లు ఇచ్చారు. 90శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి పాఠశాలలో రెండు కంప్యూటర్లు చోరీ అయ్యాయి.
►చంద్రగిరి నియోజకవర్గంలో 29 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. రామచంద్రాపురంలో 12 కంప్యూటర్లు చోరీ అయ్యాయి. చెడిపోయిన కంప్యూటర్లను బాగుచేసే వారు లేరు. కొన్నిచోట్ల కంప్యూటర్లను టీచర్లే వాడుకుంటున్నారు.
►గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 32 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చా రు. మొత్తం కంప్యూటర్లు మూలనపడ్డాయి. పాలసముద్రం మండలం బలిజకండ్రిగ హైస్కూల్‌లో 11 కంప్యూటర్లు చోరీ అయ్యాయి.
►కుప్పం నియోజకవర్గంలో 42 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. ఆరు పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. .
►మదనపల్లె నియోజకవర్గంలో 50 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. కంప్యూటర్లు ఎక్కడా పనిచేయడం లేదు. కొన్ని చోట్ల టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చినా వారు కూడా కంప్యూటర్ విద్యను బోధించే పరిస్థితి లేదు.
►పలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాల పరిధిలో 30 పాఠశాలల కు కంప్యూటర్లు ఇచ్చారు. ఎక్కడా పనిచేయడం లేదు. పలమనేరు మండలం దొడ్డిపల్లె హైస్కూల్‌లో కంప్యూటర్లు చోరీ అయ్యాయి.
►పీలేరు నియోజకవర్గంలో 55 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. ఐదు పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. కలికిరి, కలకడ పాఠశాలల్లో నాలుగు కంప్యూటర్లు చోరీ అయ్యాయి.
►పుంగనూరు నియోజకవర్గంలో 30 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. 11 పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. పుంగనూరు బసవరాజు హైస్కూల్‌లో నాలుగు కంప్యూటర్లు చోరీ అయ్యాయి. చౌడేపల్లె మండలం చారాల జెడ్పీ హైస్కూల్‌లో మూడు కంప్యూటర్లు చోరీ అయ్యాయి.
►పూతలపట్టు నియోజకవర్గంలో 29 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు మూ లనపడ్డాయి. ఎం.పైపల్లె పాఠశాలలో కంప్యూటర్లు చోరీ అయ్యాయి.
► తంబళ్లపల్లె నియోజకవర్గంలో 39 పాఠశాలలకు 320 కంప్యూటర్లు ఇ చ్చారు. బి.కొత్తకోట ఉర్దూ హైస్కూ ల్, బడికాయలపల్లె హైస్కూల్‌లో 15 కంప్యూటర్లు చోరీ అయ్యాయి.
►సత్యవేడు నియోజకవర్గంలో 45 పాఠశాలలకు 450 కంప్యూటర్లు ఇచ్చారు. 70 శాతం కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. సత్యవేడు మండలం మదనంబేడు హైస్కూల్‌లో 10 కంప్యూటర్లు చోరీ అయ్యాయి.
►నగరి నియోజకవర్గంలో 29 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. చాలా చోట్ల కంప్యూటర్లు పనిచేయడం లేదు. జనరేటర్లు కూడా పనిచేయడం లేదు.
►చిత్తూరు నియోజకవర్గంలో 31 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. కొన్ని పాఠశాలల్లో మూడు నుంచి ఐదు వరకు కంప్యూటర్లను ఇచ్చారు. కొన్ని పాఠశాలల్లో ప్రైవేటు వ్యక్తులతో కంప్యూటర్ విద్య నేర్పిస్తున్నారు. జనరేటర్లు లే వు. విద్యుత్ లేకపోతే కంప్యూటర్లు పనిచేయడం లేదు.