తనయుడి చూపు కోసం ఆ తండ్రి....
రుద్రవరం: తనయుడి చూపు కోసం ఆ తండ్రి తపిస్తున్నాడు. తన కుమారుడు సజీవంగా తిరిగివస్తాడో లేదోననే ఆందోళనతో మంచం పట్టాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన విషయం విదితమే. వీరితోపాటు కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన కొర్రె పెద్ద నాగిశెట్టి, లక్ష్మీ నర్సమ్మ కుమారుడు ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు.
తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయ చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ.. నాగిశెట్టి కుటుంబాన్ని పోషించుకొనేవాడు. అయితే రెండు సంవత్సరాల క్రితం వెన్నునొప్పి రావడంతో ఆపరేషన్ చేయించుకొనేందుకు, అలాగే కుమారుని చదువు కోసం రూ. 2 లక్షల మేర అప్పు చేశాడు. ప్రస్తుతం ఆలమూరు సిండికేట్ బ్యాంక్‌లో రూ. 80 వేలు, వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 1.20 లక్షల అప్పు ఉంది. ఈయన కుమారుడు ప్రహ్లాదుడు ఆర్థిక సమస్యలతో ఎంబీఏ చదువుతూ మధ్యలో ఆపేశాడు. ఆర్మీ, పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఉద్యోగం కోసం హైదరాబాదులో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మురళి (ప్రహ్లాదుడి సమీప బంధువు.. మామ అవుతాడు)ని ఆశ్రయించాడు.
ట్రావెల్ బస్సుతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి బియాస్ నదిలో గల్లంతయ్యాడు. కుమారుడు గల్లంతైన విషయం ఒకవైపు.. అప్పుల బాధ మరో వైపు బాధిస్తుండడంతో పెద్ద నాగిశెట్టి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన మంచం దిగలేని స్థితిలో ఉన్నాడు. భార్య వృద్ధురాలు కావడంతో ఆయన ఆలనాపాలనా కుమార్తె లక్ష్మీదేవి చూస్తోంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం ఒక విద్యార్థి శవం లభ్యమైనట్లు ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మురళి ఫోన్ ద్వారా సమాచారం అందించారని ఆమె చెప్పారు.
గల్లంతైన 24 మంది విద్యార్థులతోపాటు టూర్ కో ఆపరేటర్‌గా ప్రహ్లాదుడి పేరు నమోదు చేశారన్నారు. కంటికి రెప్పలా కాపాడే కుమారుడు లేనప్పుడు తమకు ఈ జీవితం ఎందుకని.. ఉన్న పొలం అమ్మి అప్పులు చెల్లించి విషం తీసుకుంటామని ప్రహ్లాదుడి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. ప్రహ్లాదుడి బంధువులు జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిని కలిసి, తల్లిదండ్రుల ఆవేదనను వివరించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను కలెక్టర్‌కు ఫైల్ రూపంలో అందించారు. వెంటనే కలెక్టర్.. నంద్యాల ఆర్డీఓకు ఫోన్ ద్వారా సమాచారం అందించి వీరికి సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించారు.