పంతం నీదా.. నాదా సై | Conflicts In TDP ZP Meeting Prakasam | Sakshi
Sakshi News home page

పంతం నీదా.. నాదా సై

Published Wed, Nov 7 2018 12:32 PM | Last Updated on Wed, Nov 7 2018 12:32 PM

Conflicts In TDP ZP Meeting Prakasam - Sakshi

జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల వాదులాట

ఒంగోలు టూటౌన్‌: జిల్లా అభివృద్ధికి గుండెకాయ వంటి జిల్లా పరిషత్‌ వివాదాల సంక్షోభంపై పాలకులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్‌ పాలనలో చైర్మన్‌ ఈదర హరిబాబు, సీఈవో కైలాష్‌ గిరీశ్వర్‌ మధ్య కొరవడిన  సమన్వయంపై నోరు మెదపకపోవడంపై మండిపడుతున్నారు. సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన వీరు ఎవరికి వారే మోనార్క్‌లుగా వ్యవహరిస్తున్నారు. నువ్వేంత ఎంటే నువ్వెంత అనే స్థాయికి వీరి వ్యవహరం వెళ్లటం జిల్లా ప్రజలను ఆందోళన కలిగిస్తోంది.  చివరకు జిల్లా పరిషత్‌ రోడ్డున పడింది. ఏ స్థాయికి వెళ్లిందంటే జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి అనధికార సభ్యులు వెళ్లి గొడవ చేసే స్థాయికి దిగజారింది. సోమవారం జరిగిన జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశంలో చొరబడిన కొందరు ప్రైవేట్‌ వ్యక్తులను గుర్తించి పోలీసులు బయటకుపంపిన విషయం జిల్లాలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన సమావేశం  చివరికి వీరి వివాదాలకు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వేదికవుతోంది. ప్రతి సమావేశం రచ్చ రచ్చ అవుతోంది. ప్రజా సమస్యలు, ప్రశ్నోత్తరాల సమయం గాలికిపోతోంది. అధికారులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూడాల్సి వస్తోంది. పనుల ఆమోదం కోసం సభ్యులు నెత్తి, నోరు కొట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు. గ్రామాలలో ఇంతవరకు పనులు చేయలేకపోయామని, ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నామని సభ దృష్టికి తీసుకువస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఇలా గత మూడు సమావేశాలుగా జరుగుతున్నా జిల్లా పెద్దలు, జిల్లా యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. ప్రభుత్వ కూడా చోద్యం చూస్తుండటంతో జిల్లాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో  జడ్పీలో కరువైన పాలన, చైర్మన్, సీఈవో మధ్య కొరవడిన సమన్వయంపై జిల్లా ప్రజలను కలవర పరుస్తోంది.

ఎనిమిది నెలలే గడువు..
జిల్లాలో 56 మండలాలు ఉండగా 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవి ఒంగోలు, కందుకూరు, మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లుగా పరి పాలన జరుగుతోంది. 25.92 లక్షల గ్రామీణా జనాభా ఉండగా, పట్టణ జనాభా 4.67లక్షలకు పైగా ఉన్నారు. మొత్తం 33 లక్షల వరకు జనాభా ఉన్నారు.  మొత్తం 12 శాసన సభా నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.
వీటి పరిధిలో ఉన్న 56 మండలాల నుంచి ఎన్నికైన 56 మంది జడ్పీటీసీ సభ్యులతో జిల్లా పరిషత్‌  పాలకవర్గం ఏర్పడింది. ఈ పాలక వర్గం ఏర్పడి నాలుగున్నరేళ్లయింది. ఇంకా ఎనిమిది నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ పరిస్థితులలో సోమవారం జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది.

సర్వ సభ్య సమావేశ ఉద్దేశమిది..
జిల్లాలోని గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆయా మండలాల్లోని జడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించిన పనులపై సమీక్షించాలి. చేస్తున్న పనుల వివరాలతోపాటు నిధుల కేటాయింపుల గురించి సభ దృష్టికి తీసుకురావాలి. సమావేశంలో పాలకవర్గం ఆమోదించిన పనులకు సీఈవో, చైర్మన్‌ ఆమోద ముద్ర వేయాలి. కాని గత రెండు, మూడు సమావేశాలుగా ఇలా జరగటంలేదు. పాలకవర్గం ఆమోదించిన పనులకు సీఈవో ఆమోద ముద్ర వేయకపోవడంతో సమస్య జటిలమవుతోంది. చైర్మన్‌ ప్రతిపాదించిన పనులలో లోపాలు, లొసుగుసుకులు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ తిరిస్కరిస్తుండటంపై విబేధాలు  తీవ్ర తరమయ్యాయి. ఈ విబేధాలే గత రెండు, మూడు సర్వసభ్య సమావేశాలలో ముదిరి పాకన పడ్డాయి. సమస్య ఎటు తేలకుండానే సమావేశాలు ముగిస్తుండటం పరిపాటిగా మారింది.

పెండింగ్‌లో కోట్ల రూపాయల పనులు..
రెండు వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో ఉపాధి పనుల 90 శాతం, జిల్లా పరిషత్‌ నిధులు 10శాతంతో పనులు చేయాల్సి ఉంది. ఈ పనులకు సంబంధించి గత యేడాది జూన్‌లో జరిగిన సమావేశంలో రూ.40 కోట్ల అంచనాలతో దాదాపు 668 పనులను ఆమోదించారు. ఈ ఫైల్‌ చివరకు జిల్లా కలెక్టర్‌ వద్దకు చేరి నిలిచిపోయింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రూ.7 కోట్ల విలువైన పనులకు తీర్మానాలు చేశారు. ప్రతి సభ్యుడు రూ.10 లక్షల పనులకు ప్రతిపాదించి ఆమోదించారు. ఈ ఫైల్‌ జిల్లా పరిషత్‌లో టేబుల్‌కే పరిమితమయింది. కథ దీని దగ్గర నుంచేమొదలయింది.చైర్మన్‌ అందించిన పత్రాలలో పాత తేదిలు వేశారనే అనుమానంతో సీఈవో ఈ ఫైలును ముందుకు కదలనీయ్యలేదని సమాచారం. ఆయన వాదన కూడా అదే. ఫలితంగా పనులు మంజూరులో జాప్యం జరిగిందని చర్చించుకోవడం జరుగుతుంది.  ప్రస్తుతం సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ముందు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రూ.6 కోట్ల విలువైన పనులకు సంబంధించిన ఫైలును సీఈవోకి పంపించారు. దీనిపై సీఈవో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి విషయాలు వెల్లడించారు. లోటు బడ్జెట్‌ కారణంగా చైర్మన్‌ పంపిన పనులను ఆమోదించలేమని వెల్లడించారు. దీనిపై సర్వసభ్య సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాదోపవాదాలు జరిగాయి. జడ్పీలోనూ, ట్రెజరీలో ఉన్న మొత్తం నిధులు కేవలం రూ.22.80 కోట్లేనని వాటిలో వివిధ రకాల పద్దులకు రూ.21 కోట్ల చెల్లించాల్సి ఉందని లెక్కలు వివరించారు. కేవలం రూ.1.80 కోట్లే ఉంటాయి. ఉన్న నిధులకే పనులు కేటాయించి ఆమోదించుకోవాల్సి ఉంటుందని సీఈవో వివరించారు.

సభ్యుల మొర ఆలకించని సీఈవో..
నాలుగున్నర ఏళ్లుగా గ్రామాలలో ఏ ఒక్క పనిచేయలేకపోయాం. మీ పంతాలు, పట్టింపులతో ప్రతిపాదించిన పనులు తీర్మానం కాకుండా నిలిచిపోతున్నాయి. మేము గ్రామాలలో తిరగాలా వద్దా అంటూ సభ్యులు సోమవారం వేదిక వద్దకు వెళ్లి మరీ గొడవ చేశారు. ఇద్దరు (చైర్మన్‌ని కలుపుకోని) సమన్వయంతో పనులకు ఆమోద ముద్ర వేయాలని వేడుకున్నారు. ఇదే విషయాన్ని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉన్న నిధులు ఎంత, ఎన్ని పనులు వచ్చాయి. ఏయే పనికి ఎంతెంత కేటాయించాలో తేల్చండి అని వివరంగా చెప్పారు.మీ గొడవ వల్ల సభలో ఉండలాన్న సిగ్గుగా ఉందని కూడా అన్నారు. ఎవరు చేయాల్సిన పని వారు చేయండి తెలిపారు. అయినా చివరకు గొడవలతోనే సమస్య ముగిసింది.

చైర్మన్, సీఈవో తలోదారి..
జిల్లా పరిషత్‌లో ఎడ మొహం, పెడ మొహంగా వ్యవహరిస్తున్న చైర్మన్, సీఈవో తీరుపై జిల్లా కలెక్టర్‌ గాని, అధికార పార్టీకి చెందిన మంత్రులుగాని, ప్రభుత్వం గాని పట్టించుకోకపోవడంపై జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటు ప్రజల సమస్యలను పరిష్కరించటంలో చొరవ తీసుకోకపోవడంపై పల్లె ప్రజలు మండిపడుతున్నారు. చైర్మన్, సీఈవో మాట్లాడితే చట్టాలు, పంచాయతీరాజ్‌ చట్టం, నిబంధనలు, రూల్స్‌ అంటుండటం, ఎవరికి వారే అడ్డగోలుగా వ్యవహరించడాన్ని సభ్యులుతో పాటు ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోని జిల్లా పరిషత్‌ సంక్షోభానికి తెరపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement