ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళం నెలకొంది. కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం అక్రమంగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వులు కొన్నింటిలో స్పష్టత లేకపోవడంతో ఏమిచేయాలన్న విషయంలో విద్యాశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. విద్యాశాఖాధికారులకు లేని అధికారాలను కట్టబెట్టి బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అధికారులు విస్తుపోతున్నారు.
ఖాళీగా ఓ పోస్టుకు ముగ్గురు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం, అసలు ఖాళీ లేని పోస్టులకు సైతం బదిలీ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఖాళీగా లేని పోస్టులకు కొత్తగా బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్న ఉపాధ్యాయులను ఆ స్థానాల్లో నియమిస్తే న్యాయపరమైన వివాదాలు వస్తాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌జేడీ ప్రస్తావనేదీ...
కొణిజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టుకు దిరిశవంచ జెడ్పీ హైస్కూలు హెచ్.ఎం. వై.పూర్ణచంద్రరావు, కురిచేడు హైస్కూలు హెచ్‌ఎం. బి.అరుణకుమారి, మీర్జాపేట హెచ్‌ఎం పి.హనుమంతరావుకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్ణచంద్రరావు ఇంటి పేరును కూడా తప్పుగా (అంటే ‘వై’కు బదులుగా ‘పి’)గా పేర్కొన్నారు.
వాస్తవంగా హైస్కూలు ప్రధానోపాధ్యాయులను నియమించడం, బదిలీ చేసే అధికారం ఆర్‌జేడీకి మాత్రమే ఉంది. అయితే ఈ ముగ్గురు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో ఆర్.జె.డి. ప్రస్తావనే లేదు. జిల్లా విద్యాశాఖాధికారి మాత్రమే తదుపరి చర్యలు చేపట్టమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఈ విషయంలో తగు చర్యలు సూచించచాలని కోరుతూ డీఈఓ ప్రభుత్వ ఆర్.జె.డి.కి లేఖ రాశారు.
కనిగిరి మండలం తాళ్ళూరు ఎంపీపీఎస్‌లో ఎల్.ఎఫ్,ఎల్, హెచ్‌ఎంగా పని చేస్తున్న కె.పద్మజ, దర్శి మండలం తూర్పు చవటపాలెం ఎంపీపీఎస్‌కు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే ఈ పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్.ఎం. పోస్టే లేదు.
కొత్తపట్నం మండలం అల్లూరు ఎం.పి.పి.ఎస్. సీఈలో ఒక పోస్టు మాత్రమే ఖాళీ ఉంది. ఈ పోస్టుకు అదే మండలం కె.పల్లెపాలెం ఎంపిపిఎస్‌లో ఎస్‌జీటీగా పని చేస్తున్న బి.లక్షీతులసి బదిలీ ఉత్తర్వులు పొందారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు ఎంపీపీఎస్‌లో ఎస్.జి.టి.గా పని చేస్తున్న ఎస్.రమాదేవి అల్లూరు ఎం.పి.పి.ఎస్.కు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు.అయితే ఈ పాఠశాలలో పోస్టు ఖాళీగా లేదు.
పెద్దారవీడు మండలం శానికవరం జెడ్పీ హైస్కూలులో హిందీ స్కూలు అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఉప్పాల పద్మజ యద్దనపూడి మండలం పూనూరు జెడ్పీ హైస్కూలుకు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే ఈ పాఠశాలలో స్కూలు అసిస్టెంట్ హిందీ పోస్టు ఖాళీగా లేదు.
ఉత్తర్వులున్నా వివాదమే
వెలిగండ్ల మండలం పి.నాగులవరం జెడ్పీ హైస్కూలులో ఇంగ్లీష్ స్కూలు అసిస్టెంట్‌గా పని చేస్తున్న గుండ్లాపల్లి వెంకటనాగమారుతీ మార్కాపురం మండలం కలనూతల జెడ్పీ హైస్కూలుకు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే వెంకటనాగమారుతీ నియామకంపై వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈమె బదిలీ ఉత్తర్వులను అమలు చేసే విషయంలో స్పష్టతనివ్వాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు లేఖ రాస్తున్నారు.
పోస్టే లేదు... ఉత్తర్వులు రెడీ
Published Wed, Nov 26 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement