తెలంగాణ ప్రతినిధుల్లా ఢిల్లీ పెద్దలు: గంటా
హైదరాబాద్: ఢిల్లీ పెద్దలు తెలంగాణ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. సమైక్య రాష్ట్రం కావాలంటే సస్పెండ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను తెలపడమే సీమాంధ్ర ఎంపీలు చేసిన తప్పా అని అడిగారు. తెలంగాణ ఎంపీలు గతంలో పలుమార్లు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నారని, వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.
సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఎస్. శైలజానాథ్ అనంతపురంలో అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకోవడమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ బాధాకరమని మరో మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పార్లమెంట్ విభజన బిల్లు పెడితే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని చెప్పారు.