S. Sailajanath
-
చంద్రబాబుపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ కమిషన్ కు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టేలా ఆదేశించాలని కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద కాంగ్రెస్ ధర్నా చేపడుతుందని తెలిపారు. కాగా, దళితులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. -
విద్యార్థులపై లాఠిచార్జికి ఖండన
విశాఖపట్నం: ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై పోలీసులు లాఠిచార్జి చేయడాన్ని మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ ఖండించారు. విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠిచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై పోలీసులు లాఠిచార్జి చేయడాన్ని సీపీఎం కూడా ఖండించింది. బుధవారం విశాఖపట్నంలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. -
'సీమకు రావాలసిన రాజధానిని తరలించుకుపోయారు'
హైదరాబాద్: రాయలసీమకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. శైలజానాథ్ శుక్రవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. రాజధాని అంశాన్ని బాబు తన సొంతింటి అంశంగా నిర్ణయాలు తీసుకుని సీమను మోసం చేశారని విమర్శించారు. హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో కేంద్రం రాయలసీమకు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ హామీని అమలులో టీడీపీ విస్మరిస్తోందన్నారు. ఏపీకి కేటాయించిన నదీ జలాల్లో రాయలసీమ వాటా ఎంతో తేల్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ప్రయోజనమంటూ ఒట్టి మాటలు చెప్తున్నారన్నారు. తన సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు సీమకు రావాల్సిన రాజధానిని తరలించుకుపోయారని విమర్శించారు. వరద, భూకంప ప్రాంతాంలో రాజధాని కట్టడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు ప్రభుత్వాన్ని శైలజానాథ్ ప్రశ్నించారు. -
తెలంగాణ ప్రతినిధుల్లా ఢిల్లీ పెద్దలు: గంటా
హైదరాబాద్: ఢిల్లీ పెద్దలు తెలంగాణ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. సమైక్య రాష్ట్రం కావాలంటే సస్పెండ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను తెలపడమే సీమాంధ్ర ఎంపీలు చేసిన తప్పా అని అడిగారు. తెలంగాణ ఎంపీలు గతంలో పలుమార్లు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నారని, వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఎస్. శైలజానాథ్ అనంతపురంలో అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకోవడమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ బాధాకరమని మరో మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పార్లమెంట్ విభజన బిల్లు పెడితే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని చెప్పారు. -
తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తాం: శైలజానాథ్
హైదరాబాద్: తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో చర్చకు వస్తే దాన్ని ఓడించి తీరాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం నిర్ణయించుకున్నామని మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఇతర పార్టీలు కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తీర్మానం వీగిపోతే ఆ తరువాత రాష్ట్ర విభజన ఎలా జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులతో కలసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాకే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికీ విభజనకే కట్టుబడి ఉన్నట్లు చెప్పడం విచారకరమన్నారు. అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది కనుక తప్పనిసరిగా తెలంగాణ ఏర్పాటు అంశం అసెంబ్లీలో చర్చకు రాకతప్పదని, అప్పుడు సీమాంధ్రుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండేందుకు ఏ ఒక్కరూ రాజీనామా చేయరాదని కోరారు. రాజీనామాలు ఆమోదింపచేసుకోవడమంటే అది విభజనను సమర్థించడమే అవుతుందని చెప్పారు. రెండు నెలలుగా అన్నివర్గాలు ఉద్యమంలో ఉన్నాయని, ఈ తరుణంలో రాజకీయాలు చర్చించరాదని చెప్పారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్ష వాయిదా
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ 48 గంటల పాటు హైదరాబాద్‌లో దీక్ష చేయాలని సంకల్పించిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈనెల 3న అసెంబ్లీ ఆవరణలో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష సందర్భంగా సమైక్యాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఫోరం కన్వీనర్ శైలజానాథ్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనంలోపే 48 గంటల దీక్ష చేపడతామని ప్రకటించారు. అయితే దీక్ష ఎక్కడ నిర్వహించాలో నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతోపాటు నిమజ్జనంలోపు దీక్షకు అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేయడంతో.. దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. దీక్ష ఎప్పుడు, ఎక్కడ చేపట్టాలనే విషయాన్ని శుక్రవారం వెల్లడించనున్నారు. -
హోంశాఖ అధికారులతో సీమాంధ్ర నేతల భేటీ
కేంద్ర హోంశాఖ అధికారులను సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎస్. శైలజానాథ్, రుద్రరాజు పద్మరాజు, పాలడుగు వెంకట్రావు కలిశారు. దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రివర్గం ముందుకు తేనున్న తెలంగాణ నోట్‌పై నాయకులు ఆరా తీసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్రహోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధమయిందని హోంశాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంశాఖ అధికారులను సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే హోంశాఖలోని తమ మిత్రులమని కలవడానికి వెళ్లామని మీడియాతో శైలజానాథ్, రుద్రరాజు చెప్పారు. దేశ పౌరుడిగా ఎవరినైనా కలిసే హక్కు తమకుందని తెలిపారు. ఈ సమయంలో హోంశాఖకు ఎందుకు వస్తాం.. మీకు తెలియదా అంటూ ముక్తాయించారు.