తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తాం: శైలజానాథ్
హైదరాబాద్: తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో చర్చకు వస్తే దాన్ని ఓడించి తీరాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం నిర్ణయించుకున్నామని మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఇతర పార్టీలు కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తీర్మానం వీగిపోతే ఆ తరువాత రాష్ట్ర విభజన ఎలా జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులతో కలసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు.
విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాకే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికీ విభజనకే కట్టుబడి ఉన్నట్లు చెప్పడం విచారకరమన్నారు. అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది కనుక తప్పనిసరిగా తెలంగాణ ఏర్పాటు అంశం అసెంబ్లీలో చర్చకు రాకతప్పదని, అప్పుడు సీమాంధ్రుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండేందుకు ఏ ఒక్కరూ రాజీనామా చేయరాదని కోరారు. రాజీనామాలు ఆమోదింపచేసుకోవడమంటే అది విభజనను సమర్థించడమే అవుతుందని చెప్పారు. రెండు నెలలుగా అన్నివర్గాలు ఉద్యమంలో ఉన్నాయని, ఈ తరుణంలో రాజకీయాలు చర్చించరాదని చెప్పారు.