Rudraraju Padmaraju
-
వెయ్యి కాదు....రూ.5వేల కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : హుదూద్ తుఫాను వల్ల నష్టపోయిన ఉత్తరాంధ్ర పునరుద్ధరణకు వెయ్యి కోట్లు సరిపోవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తక్షణ సాయంగా రూ.5వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుఫాను వల్ల రూ.70వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా అని, దీనిపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు రుణమాఫీ చేయకపోవటంతో రైతులు బీమా అవకాశాన్ని కోల్పోయారని పద్మరాజు అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి రైతులకు పంట బీమా వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తే ఊరటగా ఉంటుందన్నారు. -
షరతులు, పరిమితులను నిరసిస్తూ..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. ఎన్నికల హామీల అమలుపై మీనమేషాలు లెక్కిస్తున్న టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్దమైంది. ఈ నెల 4న ఏపీలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తెలిపారు. వ్యవసాయ మాఫీపై షరతులు, పరిమితులు విధించడాన్నినిరసిస్తూ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను మాఫీ చేయాలని పద్మరాజు డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ పథకాలను కొనసాగించాలి: రుద్రరాజు
సాక్షి, హైదరాబాద్: దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కు, ఆయన మంత్రి వర్గానికి సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పేరొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు స్థానిక ఇందిరాభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలనాదక్షత, అపార అనుభవమున్న కేసీఆర్ సీఎంగా మంచి పాలన అందిస్తారనే నమ్మకముందన్నారు. అయితే, కాంగ్రెస్ పథకాలను కేసీఆర్ విజ్ఞతతో కొనసాగిస్తారన్న ఆశాభావం, విశ్వాసం కూడా తమకుందని చెప్పారు. తెలంగాణాలో కాంగ్రె స్ ఓడిపోయినా ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. -
'బీజేపీలో చేరుతారన్న కథనాలు అవాస్తవం'
హైదరాబాద్ : మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరుతారన్న కథనాలు అవాస్తవమని సీమాంధ్ర పీసీసీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. బొత్స కరుడుకట్టిన కాంగ్రెస్ వాది అని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు పీసీసీ చీఫ్‌గా పనిచేసిన ఆయన కాంగ్రెస్‌ను వీడుతారనుకోవటం లేదన్నారు. చంద్రబాబు చెప్పేదొకటి...చేసేదొకటి అని పద్మరాజు మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం ఆయనకు తెలియదని ధ్వజమెత్తారు. రుణమాఫీ అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారన్నారు. అందుకే చంద్రబాబు ఆల్‌ఫ్రీ బాబు అని ప్రజలు వ్యంగ్యంగా చెప్పుకుంటున్నారని పద్మరాజు అన్నారు. సామాజిక న్యాయం అంటూ ఏళ్ల తరబడి బీసీలను టీడీపీ మోసం చేస్తోందని సీమాంధ్ర పీసీసీ అధికార ప్రతినిధి గౌతమ్ ఆరోపించారు. బీసీలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీమాంధ్ర సీఎం పదవికి బీసీ పేరును ప్రతిపాదించాలని సవాల్ విసిరారు. -
'సీమాంధ్ర మంత్రుల్లో అభిప్రాయ భేదాలు లేవు'
హైదరాబాద్ : సమైక్య రాష్ట్ర ఉద్యమ తీవ్రతను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ కమిటీ రాష్ట్రానికి రావాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే అంశంపై సీమాంధ్ర మంత్రుల్లో అభిప్రాయ భేధాలు లేవని ప్రభుత్వ విప్ పద్మరాజు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే అంశంపై తాజా రాజకీయ పరిణామాలను చర్చించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు గురువారం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సమావేశం కానున్నట్లు తెలిపారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రేపు ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో సీమాంధ్ర మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని పద్మరాజు తెలిపారు. -
తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తాం: శైలజానాథ్
హైదరాబాద్: తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో చర్చకు వస్తే దాన్ని ఓడించి తీరాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం నిర్ణయించుకున్నామని మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఇతర పార్టీలు కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తీర్మానం వీగిపోతే ఆ తరువాత రాష్ట్ర విభజన ఎలా జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులతో కలసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాకే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికీ విభజనకే కట్టుబడి ఉన్నట్లు చెప్పడం విచారకరమన్నారు. అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది కనుక తప్పనిసరిగా తెలంగాణ ఏర్పాటు అంశం అసెంబ్లీలో చర్చకు రాకతప్పదని, అప్పుడు సీమాంధ్రుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండేందుకు ఏ ఒక్కరూ రాజీనామా చేయరాదని కోరారు. రాజీనామాలు ఆమోదింపచేసుకోవడమంటే అది విభజనను సమర్థించడమే అవుతుందని చెప్పారు. రెండు నెలలుగా అన్నివర్గాలు ఉద్యమంలో ఉన్నాయని, ఈ తరుణంలో రాజకీయాలు చర్చించరాదని చెప్పారు. -
హోంశాఖ అధికారులతో సీమాంధ్ర నేతల భేటీ
కేంద్ర హోంశాఖ అధికారులను సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎస్. శైలజానాథ్, రుద్రరాజు పద్మరాజు, పాలడుగు వెంకట్రావు కలిశారు. దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రివర్గం ముందుకు తేనున్న తెలంగాణ నోట్‌పై నాయకులు ఆరా తీసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్రహోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధమయిందని హోంశాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంశాఖ అధికారులను సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే హోంశాఖలోని తమ మిత్రులమని కలవడానికి వెళ్లామని మీడియాతో శైలజానాథ్, రుద్రరాజు చెప్పారు. దేశ పౌరుడిగా ఎవరినైనా కలిసే హక్కు తమకుందని తెలిపారు. ఈ సమయంలో హోంశాఖకు ఎందుకు వస్తాం.. మీకు తెలియదా అంటూ ముక్తాయించారు. -
తెలంగాణ రావాలని కేసీఆర్‌కు లేదు: రుద్రరాజు
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు తెలంగాణ రావాలని లేదని ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు అన్నారు. రాష్ట్రం విభజిస్తున్నట్లు ప్రకటించిన తరువాత కెసిఆర్ వ్యాఖ్యలు సీమాంధ్రులను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రం రావణకాష్టంగా ఉండాలన్నదే కేసీఆర్ కోరిక అని పద్మరాజు విమర్శించారు. కేసీఆర్ వైఖరి వల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన మండిపడ్డారు.