కాంగ్రెస్ పథకాలను కొనసాగించాలి: రుద్రరాజు
సాక్షి, హైదరాబాద్: దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కు, ఆయన మంత్రి వర్గానికి సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పేరొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు స్థానిక ఇందిరాభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలనాదక్షత, అపార అనుభవమున్న కేసీఆర్ సీఎంగా మంచి పాలన అందిస్తారనే నమ్మకముందన్నారు. అయితే, కాంగ్రెస్ పథకాలను కేసీఆర్ విజ్ఞతతో కొనసాగిస్తారన్న ఆశాభావం, విశ్వాసం కూడా తమకుందని చెప్పారు. తెలంగాణాలో కాంగ్రె స్ ఓడిపోయినా ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు.