వేగు వచ్చాడు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. గెలుపు గుర్రాల అన్వేషణకు వేగులను రంగంలోకి దింపింది. జిల్లాలో పార్టీ పరిస్థితి అంచనాకు అధిష్టానం దూతను పంపింది. ఏఐసీసీ నియమించిన పార్టీ పరిశీలకుడు ప్రకాశ్ ఎల్గుల్వర్ సోమవారం గాంధీభవన్‌లోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌తో భేటీ అయ్యారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి పరిశీలకుడిగా వచ్చిన ప్రకాశ్.. నియోజకవర్గం పరిధిలో పార్టీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ ముఖ్యులతో సమావేశం కావాలని ఆయన నిర్ణయించారు. మల్కాజిగిరి పార్లమెంటరీ సెగ్మెంట్‌లోని ఏడు శాసనసభ స్థానాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతల పనితీరు, ఆశావహుల జాబితాను ఆరా తీసిన ప్రకాశ్.. ప్రత్యర్థుల బల బలాలపై స్థూలంగా కసరత్తు చేసినట్లు సమాచారం.
సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తె లిసింది. రాష్ట్ర విభ జనతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నప్పటికీ, జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఎన్నికల్లోనే తేలుతుందని ఒకరిద్దరు నేతలు ఆయనతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సహా జిల్లా ఇన్‌చార్జి ప్రేమ్‌లాల్ పరిశీలకుడితో సుదీర్ఘంగా చర్చించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బాధ్యులతో జరిపే అభిప్రాయ సేకరణకు సంబంధించిన తేదీలను ఖ రారు చేశారు. ప్రతి రోజూ రెండు లేదా మూడు సెగ్మెంట్ల నేతలతో భేటీ కానున్నారు. 9న ఉదయం 10:30 గంటలకు మేడ్చల్, మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజిగిరి, 10న ఉదయం కుత్బుల్లాపూర్, మధ్యాహ్నం కూకట్‌పల్లి, సాయంత్రం 4 గంటలకు ఉప్పల్, 11న ఉదయం ఎల్‌బీనగర్, మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నాయకులతో సంప్రదింపులు జరుపనున్నారు. ఆయా నియోజకవర్గాల నాయకులతో అభిప్రాయసేకరణ జరిపి ఆ నివేదికను అధిష్టానానికి నివేదించనున్నారు.