బాబ్బాబు రాజీనామా చేయండి... ఎంపీ లగడపాటికి మద్దతివ్వండి... ఎంపీ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన వర్గీయులందరికీ ఇలా ఫోన్లు వెళ్లాయి.
సాక్షి, విజయవాడ :
బాబ్బాబు రాజీనామా చేయండి... ఎంపీ లగడపాటికి మద్దతివ్వండి... ఎంపీ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన వర్గీయులందరికీ ఇలా ఫోన్లు వెళ్లాయి. ఎక్కువమంది నుంచి దీనికి స్పందన కొరవడింది. అసలు విషయానికొస్తే.. లోక్‌సభలో అవిశ్వాసం పెట్టిన ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో పాటు మరో ఐదుగురు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పటికే పార్టీ మారి కొత్త పార్టీ ఆలోచనలో ఉన్న ఎంపీ వర్గానికి ఇదో మంచి అవకాశంగా మారింది. దీంతో తమకు అనుకూలంగా ఉండేవారితో రాజీనామాలు చేయించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, పార్టీలో ఇతర పదవుల్లో ఉన్న నేతలకు కార్యాలయ సిబ్బంది నుంచి ఫోన్లు వెళ్లాయి. ఒక దశలో ఎమ్మెల్యేలు కూడా ఎంపీకి మద్దతుగా రాజీనామాలు చేస్తున్నారంటూ ప్రచారం సాగించారు.
ఎంపీ రాజగోపాల్‌కు మద్దతుగా రాజీనామా చేసేందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, విజయవాడ నగర అధ్యక్షుడు అడపా నాగేంద్రం, గౌరవాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు తిరస్కరించినట్లు సమాచారం. దీనిపై గౌరవాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పనిచేస్తున్న ఎంపీపై బహిష్కరణ వేటును వెనక్కి తీసుకోవాలని కోరుతామని, పార్టీ పదవులకు రాజీనామా చేయడం లేదని చెప్పారు. మరోపక్క ఎమ్మెల్యేలు కూడా ముందుకు రాలేదు.
రాజీనామాలు చేసింది వీరే...
పీసీసీ మాజీ కార్యదర్శి షేక్ ముక్తియార్, ఎస్‌సీ సెల్ నేతలు బెజవాడ యోహాన్, గుడ్డేటి విద్యాసాగర్, బొమ్మల శ్రీను, ఉమ్మడి ధనరాజ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిద్దుకూరి శివ, మాజీ కార్పొరేటర్లుమాగంటి నరసింహ చౌదరి, మురిపాల సత్యవతి, ఇతర నాయకులు పుట్టి శరత్‌కుమార్ యాదవ్, పోతిన పైడిరావు, షేక్ అజీజ్, కట్టా మల్లి, సీహెచ్ శాంతకుమార్ తదితరులు ఉన్నారు.