కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ :సోనియాగాంధీ ఓ నియంతలాగా తెలుగు ప్రజలను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కలెక్టరేట్ ఎదుట మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, హఫీజుల్లా కాల్‌టెక్స్, అల్లాడు పాండురంగారెడ్డి, సంపత్‌కుమార్‌లతో కలిసి ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష బుధవారానికి మూడవ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంతోమంది నియంతలు రాజ్యాలు పోగొట్టుకుని మట్టి పాలయ్యారనే విషయం సోనియాగాంధీ గుర్తించాలన్నారు. ఎన్జీఓల సమ్మెను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని, వారికి వైఎస్సార్ సీపీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు ఉద్యోగులు భయపడవద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఈ దుస్థితి తలెత్తడానికి ప్రధాన కారణం సోనియాగాంధీ, చిరంజీవి, చంద్రబాబులేనని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడితే నిలబెడతానంటూ చిరంజీవి ఒకసారి రక్షించాడని, అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు దానికి మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు మరోసారి రక్షించారన్నారు. సీబీఐ కేసులకు భయపడి చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారన్నారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లు పాస్ కావడానికి కూడా టీడీపీ ఎంపీలు సహకరించారన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్లమెంటులో విప్ ధిక్కరించి ఆహార భద్రతా బిల్లును బహిష్కరించాలన్నారు. అలాగైతైనే సీమాంధ్ర ప్రాంతంలో అడుగు పెట్టాలని తేల్చి చెప్పారు. పదవుల కోసం ఆరు కోట్ల మంది సీమాంధ్రుల పొట్టకొడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రక్షణశాఖ కొనుగోళ్లలో జరిగిన స్కాంపై ఆంటోని కమిటీ చేసిందేమి లేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనపై కూడా ఆ కమిటీ పెద్దగా చేసేదేమి ఉండదని చెప్పారు. ఆ కమిటీలోని వారికి రాష్ట్రంలోని ప్రజల జీవనశైలి, ఇక్కడున్న నదీ జలాల వివాదాలు తెలుసా? అని ప్రశ్నించారు. ఆ కమిటీ ఇక్కడికి రాదట! మనమే ఢిల్లీకి వెళ్లి బొత్స సత్యనారాయణ ఎవరు చెబితే వారు వెళ్లి కమిటీని కలవాలంట! ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడాలన్నారు. సోనియాగాంధీ, సీఎం కిరణ్, చంద్రబాబు వీరిలో ఎవరైనా పేద ప్రజల కోసం ఒక్కరోజు కడుపు మాడ్చుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు నీతి, నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదని హెచ్చరించారు.
ఎన్టీఆర్ బ్రతికివుంటే ఆత్మహత్య చేసుకునేవారు -మాజీ మేయర్ :
తెలుగుదేశం పార్టీకి పట్టిన గతి చూసి దివంగత ఎన్టీఆర్ బ్రతికివుంటే ఆత్మహత్య చేసుకునేవారని మాజీ మేయర్ పి.రవీంద్రనాధరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్‌కు అమ్మేశారని ఆరోపించారు. కమీషన్ల కోసం సీబీఐ కేసులకు భయపడి పార్టీని గంగపాలు చేశారన్నారు.
ఫలితంగా ఆ పార్టీ ఉనికిని కోల్పోయిందన్నారు. టీడీపీ ఊసరవెల్లి రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు. తమ జీవితాలు ఆరిపోయినా సమైక్యాంధ్రను కాపాడుకుంటామన్నారు. విభజన వల్ల రాష్ట్రవ్యాప్తంగా 340 మంది ఆత్మహత్య చేసుకుని గుండె పగిలి చనిపోయారన్నారు. వారందరికీ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, బ్రతికి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, కడప నగర సమన్వయకర్త ఎస్‌బి అంజద్‌బాషా పాల్గొన్నారు.
నియంతలు మట్టి పాలయ్యారు
Published Thu, Aug 15 2013 5:10 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement