ఐక్యత వచ్చేనా? | congress leaders to meet today | Sakshi
Sakshi News home page

ఐక్యత వచ్చేనా?

Published Sat, Sep 21 2013 2:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress leaders to meet today

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సుదీర్ఘకాలం తర్వాత శనివారం జరగనున్న జిల్లా కాంగ్రెస్ సమావేశానికి ముఖ్య నేతలంతా హాజరయ్యేది అనుమానంగానే ఉంది. జిల్లాలో సీఎం పర్యటన వంటి సందర్భాలు మినహా జిల్లా నేతలందరూ ఒకచోట సమావేశం కావడం అరుదైన విషయంగానే చెప్పవచ్చు. అయితే జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగే ఈ సమావేశానికి పార్టీకి చెందిన జిల్లా ముఖ్య నేతలు ఎంతమంది హాజరవుతారనే అంశంపైనా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం జిల్లా కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కేంద్రంగా సమీకృతమవుతున్నట్లు కనిపిస్తోంది. సీబీఐ చార్జిషీట్‌లో తొమ్మిదో నిందితురాలిగా వున్న మంత్రి గీతారెడ్డి శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. సంగారెడ్డిలో జరిగే పార్టీ సమావేశానికి హాజరవుతారా లేదా అని పార్టీ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి సమావేశంలో పాల్గొనే అంశంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
 
 మెదక్ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన చాగన్ల నరేంద్రనాథ్‌కు సమావేశానికి సంబంధించిన ఆహ్వానమేదీ అందలేదని ఆయన అనుచరులు చెప్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన పార్టీ అధ్యక్షురాలు సోనియాకు అభినందనలు తెలిపేందుకు ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. పీసీసీ ఆదేశాల మేరకు పార్టీ మద్దతుతో గెలిచిన నూతన సర్పంచ్‌లు, డీసీసీబీ డెరైక్టర్లు, సహకార సొసైటీ చైర్మన్లకు పార్టీ ముఖ్య నేతలు సన్మానం చేస్తారు. జిల్లా కాంగ్రెస్ నేతలను ఒకే తాటిపైకి తీసుకురావడం సమావేశం లక్ష్యం’ అని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నాయకుడొకరు వెల్లడించారు.
 
 ఏర్పాట్లలో ఎవరికి వారే
 సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న ‘కాంగ్రెస్ భవన్’ను తన హయాంలో పూర్తిచేయాలని డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి భావిస్తున్నారు. శనివారం తొలుత బైపాస్ రోడ్డులో భవన నిర్మాణం పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరయ్యే నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలికేందుకు ఎవరికి వారుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి దూరంగా వుంటారని భావిస్తుండగా, ఆయన పేరిట స్వాగత ఏర్పాట్లు మాత్రం భారీగా సాగుతున్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం మద్దతుదారులు కూడా స్వాగత ఏర్పాట్లు చేస్తుండటంతో సంగారెడ్డి పట్టణంలో శనివారం పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలియనున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement