సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర విభజనపై ఓ వైపు రచ్చ జరుగుతుండగా, జిల్లాకు చెందిన నాయకులు మాత్రం వచ్చే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే రాజకీయ సమీకరణాలు అంచనా వేసుకుంటూ వ్యూహ, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయాలు గ్రూపులు, వర్గాలుగా సాగుతుండడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారుగా సొంత ప్రయత్నాల్లో ఉన్నారు. జిల్లాకు చెందిన కొందరు నేతలు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చుట్టూ కేంద్రీకృతమవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో దామోదరకు సీఎం పదవి దక్కుతుందనే ప్రచారం నేపథ్యంలో ఆయన దృష్టిలో పడేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో పరిచయాలు, నేతలు ఆశీస్సులు పొందేలా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు.
రికార్డు స్థాయిలో కాంగ్రెస్‌కు జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండగా, వీరిలో అత్యధికులు సిట్టింగ్ కోటాలో మరోమారు టికెట్ దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడితే రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరిగి తమకూ అవకాశం వస్తుందనే ఆశలో కాంగ్రెస్ ఔత్సాహిక నేతలున్నారు. ప్రస్తుతం మెదక్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌లో టికెట్ కోసం పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. 2009 ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ ఆశీస్సులతో పోటీ చేసిన నరేంద్రనాథ్‌ను పార్టీ వీడే దిశగా ఒత్తిడి చేయడంలో కాంగ్రెస్ నేతలు సఫలమయ్యారు. మరోవైపు టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుకునే దిశలో ఉన్న ఎంపీ విజయశాంతి ఇంకా పార్టీలో అధికారికంగా చేరలేదు. డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి తదితరులు పరిణామాలను విశ్లేషించుకుంటూ పోటీ చేసే అవకాశం కోసం గుంభనంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
విపక్ష పార్టీల్లో అయోమయం
విలీనం, పొత్తు అంశాలపై టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఇంకా అస్పష్టత తొలగలేదు. తెలంగాణ ఏర్పడితే అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో పార్టీ శ్రేణులకు అంతు పట్టడం లేదు. నాలుగైదు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులు ఎవరుంటారనే అంశంపై పార్టీలో స్పష్టత లేదు. ఎంపీ విజయశాంతి పార్టీని వీడిన నేపథ్యంలో మెదక్ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ పోటీ చేస్తారా? లే క మరెవరికైనా అవకాశం ఇస్తారా? అనే కోణంలో పార్టీలో చర్చ సాగుతోంది. ఒకవేళ కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమైతే తమ రాజకీయ భవితవ్యం ఏమిటనే అంశంపైనా నేతల్లో అయోమయం నెలకొంది. ఇక టీడీపీ తరఫున అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమిస్తామని, వచ్చే ఎన్నికల్లో వారే అభ్యర్థులు అవుతారని ఈ పార్టీ అధినేత చంద్రబాబు నవంబరు చివరి వారంలో ప్రకటించారు.
అయితే నేటికీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో ఔత్సాహిక నేతల్లో నిరుత్సాహం నెలకొంది. దీంతో టీడీపీ నేతలు కొందరు టీఆర్‌ఎస్, బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారు. బీజేపీకి సానుకూల పవనాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో పార్టీలో ఇప్పటికే టికెట్ల కోసం నేతలు అంతర్గతంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. చాలాచోట్ల తమకు పోటీ వస్తున్న వారిపై అంతర్గతంగా ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది. అన్ని పార్టీల్లోనూ లోలోన రాజకీయ సమీకరణాలు సాగుతున్నా, ఏ ఒక్క పార్టీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను చేపట్టడం లేదు. అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చిన తర్వాతే జనంలోకి వెళ్లాలనిఆయా పార్టీల నేతల ఆలోచనగా కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన చర్చ సమయంలో నోరు విప్పని నేతలు
Published Thu, Dec 19 2013 12:34 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement