
కాంగ్రెస్ నన్ను ముద్దాయిని చేసింది: ధర్మాన
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తనను ముద్దాయిని చేసిందని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ముద్దాయిలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అంటున్నారని... ముద్దాయిగా రాజకీయాల నుంచి తప్పుకోవటం సరికాదని ఆయన అసెంబ్లీ లాబీలో అన్నారు. తనకు కాంగ్రెస్ లో స్థానం లేదని ధర్మాన పేర్కొన్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని... అందుకే రాజకీయాల్లో కొనసాగుతానని ధర్మాన తెలిపారు.
మొదటి నుంచి టీడీపీకి తాను వ్యతిరేకంగా పోరాడుతున్నానని అందుకే ఆ పార్టీలోకి వెళ్లలేనని.... ఇక ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ధర్మాన అన్నారు. త్వరలో ఆపార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమామవేశాల్లో విభజన బిల్లు చర్చకు రాదని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని ధర్మాన అన్నారు.