
సీమాంధ్ర నేతల భేటీకి బొత్స ఝాన్సీ డుమ్మా
హైదరాబాద్ : సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, తెలంగాణపై కేంద్రం ముందుకు వెళుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్లోని క్లబ్ హౌజ్లో భేటీ అయ్యారు. అయితే మినిస్టర్స్ క్వార్టర్స్‌లోనే ఉన్నా భేటీకి రావడం ఇష్టంలేని ఎంపీ బొత్స ఝాన్సీ బయటకు వెళ్లిపోయారు.
కాగా అధిష్టానం విభజనపై వెనక్కు తగ్గేది లేదని చెబుతుండడం, సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. దీంతో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు వీరంతా సమావేశమయ్యారు. ఈ భేటీకి కావూరి, పల్లంరాజు, పురంధేశ్వరి, ఎంపీలు లగడపాటి, బాపిరాజు, కేవీపీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు హాజరయ్యారు.
అయితే రాజీనామాలు చేయాలా? వద్దా? అనే విషయంలో సీమాంధ్ర ప్రాంత ఎంపీల్లో ఏకాభిప్రాయం లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అంతకు ముందు వెల్లడించారు. ఏడుగురు సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు ఆమోదింపజేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కొంత మంది సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని చెప్పారు.