కాంగ్రెస్ ... రాష్ట్రాన్ని కాదు ప్రజలను విభజిస్తుంది: జవదేకర్
తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. తమ పార్టీతో తెలుగుదేశం పొత్తు అంటూ వస్తున్న వార్తలు అన్ని ఊహాగానాలే అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లోని నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన సమైక్యత పరుగులో ఆయన పాల్గొన్నారు.
అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరైనంత మాత్రన పొత్తు కుదురుతుందా అంటూ ప్రకాశ్ జవదేకర్ ఎదురు ప్రశ్నించారు. అయితే రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజనకు బదులు కాంగ్రెస్ పార్టీ ప్రజలను విభజిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెడుతుందన్న నమ్మకం లేదని జవదేకర్ తెలిపారు. అందుకు లోక్పాల్ బిల్లు, మహిళ బిల్లులే మంచి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. అటు తెలంగాణ ఇటు సీమాంధ్ర ప్రాంతాల్లో ఆ పార్టీ ఘోరంగా ఒడిపోతుందని జోస్యం చెప్పారు.
సర్థార్ పటేల్ వర్థంతి సందర్బంగా ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన సమైక్యత పరుగుకు మంచి స్పందన వచ్చిందన్నారు. కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి సర్థార్ పటేల్ 63వ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం సమైక్యత పరుగుకు బీజేపీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.