వృద్ధ పార్టీ ఉనికి ఆశలు!
స్వాతంత్ర్యం పూర్వం నుంచి ఉన్న వృద్ధ పార్టీ నూతన ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోసం పాకులాడుతోంది. తెలుగువారి ఆదరణ కరువడడం, అటు కేంద్రంలోనూ పవర్ పోవడంతో కాంగ్రెస్ పార్టీ కుదేలయింది. హస్తం పార్టీ విభజన వ్యూహాన్ని తెలుగువారు తిప్పికొట్టడంతో దిక్కులేని పరిస్థితిలో పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే అడ్రస్ లేకుండా పోయింది. విభజనతో తెలంగాణలో పాగా వేద్దామనుకున్నా పాచిక పారలేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది కాంగీయుల పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రాతనిథ్యం కరువడంతో కాంగ్రెస్ ఇప్పుడు నందిగామ ఉప పోరుపై ఆశలు పెట్టుకుంది. ఈ ఒక్క సీటులోనైనా గెలిచి ఏపీలో తాము ఉనికిలో ఉన్నామనిపించుకోవాలని తలపోస్తోంది. ఇందుకోసం నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలోకి దిగింది. బోడపాటి బాబూరావును అభ్యర్థిగా నిలిపింది. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం కానుంది. టీడీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ నందిగామలో పాగా వేయాలని బలంగా కోరుకుంటోంది.
ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన క్రేడిట్ తమదే కాబట్టి గంపగుత్తుగా ఓట్లు తమకే పడతాయని ఆశపడి భంగపడిన హస్తం పార్టీ ఇప్పుడు ఇప్పుడు మెదక్ ఉప ఎన్నికలోనూ పోటీకి దిగింది. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని తెలంగాణ కాంగీయులు కలలు కంటున్నారు. మరోపక్క గెలిచిన తమ నాయకులు 'కారు' ఎక్కకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతోంది. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత మీదంటే మీదంటూ ఇప్పటికీ కుమ్ములాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులు మెదక్ లోనైనా చేయిచేయి కలుపుతారో, లేదో చూడాలి.