Tangirala prabhakara rao
-
ప్రశాంతం
69.46 శాతం పోలింగ్ నమోదు గతం కంటే 15.54 శాతం తగ్గిన పోలింగ్ 16న ఓట్ల లెక్కింపు నందిగామ : నందిగామ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శనివారం ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగింది. ఓటర్ల నుంచి స్పందన కొరవడటంతో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. మూడు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 15.54 శాతం తక్కువగా 69.46 శాతం పోలింగ్ నమోదైంది. టీడీపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ తరఫున తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి బోడపాటి బాబురావు, సీపీఎం మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా వీరులపాడు మండలానికి చెందిన మాతంగి పుల్లారావు, మరో స్వతంత్ర అభ్యర్థిగా నందిగామకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి కటారపు పుల్లయ్య పోటీ చేశారు. ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ సాగింది. పోలింగ్ సరళి ఇలా... ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో 181వ నంబరు పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించటంతో అరగంట సేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. వెంటనే అధికారులు పరిస్థితిని చక్కదిద్దటంతో పోలింగ్ యథావిధిగా కొనసాగింది. మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. ఉదయం 9 గంటలకు 12 శాతం నమోదైన పోలింగ్ క్రమేపీ పెరిగింది. 11 గంటలకు 26.55 శాతం, ఒంటి గంటకు 47 శాతం, 3 గంటలకు 56 శాతం, 5 గంటలకు 61 శాతం, చివరకు 69.46 శాతం నమోదైంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 200 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 129 బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు 15 బూత్‌లలో ఏజెంట్లు లేకపోవడంతో అధికార పార్టీకి అడ్డులేకుండా పోయింది. కంచికచర్లలో 30 మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ విజయ్‌కుమార్ పరిశీలించారు. చందర్లపాడు, కంచికచర్ల, నందిగామ, వీరులపాడు మండలాల్లో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. ఆయన నందిగామలో విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నందిగామలో పోలింగ్ బూత్‌లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని సమీక్షించారు. 1,400 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు. 1,500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ ముగిసిన అనంతరం శనివారం రాత్రికి నందిగామలోని కేవీఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌కు ఈవీఎంలను తరలించారు. 16న కౌంటింగ్ నందిగామలోని కేవీఆర్ కళాశాలలో ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. సోమవారంలోపు కౌంటిం గ్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తామని రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు తెలిపారు. -
వృద్ధ పార్టీ ఉనికి ఆశలు!
స్వాతంత్ర్యం పూర్వం నుంచి ఉన్న వృద్ధ పార్టీ నూతన ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోసం పాకులాడుతోంది. తెలుగువారి ఆదరణ కరువడడం, అటు కేంద్రంలోనూ పవర్ పోవడంతో కాంగ్రెస్ పార్టీ కుదేలయింది. హస్తం పార్టీ విభజన వ్యూహాన్ని తెలుగువారు తిప్పికొట్టడంతో దిక్కులేని పరిస్థితిలో పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే అడ్రస్ లేకుండా పోయింది. విభజనతో తెలంగాణలో పాగా వేద్దామనుకున్నా పాచిక పారలేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది కాంగీయుల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ప్రాతనిథ్యం కరువడంతో కాంగ్రెస్ ఇప్పుడు నందిగామ ఉప పోరుపై ఆశలు పెట్టుకుంది. ఈ ఒక్క సీటులోనైనా గెలిచి ఏపీలో తాము ఉనికిలో ఉన్నామనిపించుకోవాలని తలపోస్తోంది. ఇందుకోసం నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలోకి దిగింది. బోడపాటి బాబూరావును అభ్యర్థిగా నిలిపింది. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం కానుంది. టీడీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ నందిగామలో పాగా వేయాలని బలంగా కోరుకుంటోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన క్రేడిట్ తమదే కాబట్టి గంపగుత్తుగా ఓట్లు తమకే పడతాయని ఆశపడి భంగపడిన హస్తం పార్టీ ఇప్పుడు ఇప్పుడు మెదక్ ఉప ఎన్నికలోనూ పోటీకి దిగింది. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని తెలంగాణ కాంగీయులు కలలు కంటున్నారు. మరోపక్క గెలిచిన తమ నాయకులు 'కారు' ఎక్కకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతోంది. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత మీదంటే మీదంటూ ఇప్పటికీ కుమ్ములాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులు మెదక్ లోనైనా చేయిచేయి కలుపుతారో, లేదో చూడాలి. -
ఉప ఎన్నిక ఖాయం
నందిగామ కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు నేడు నామినేషన్ నందిగామ : నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు పార్టీ ప్రకటించడంతో పోటీ అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ఉప ఎన్నిక జరుగనుంది. చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే పోటీ పెట్టకూడదని ఒక సంప్రదాయం ఉంది. ఆ క్రమంలోనే దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్యను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను టీడీపీ అధిష్టానంతో సహా నాయకులంతా సౌమ్య ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరారు. ఇతర రాజకీయ పార్టీలు ఎవ రూ పోటీ చేయరని మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రజలు భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నందిగామ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బోడపాటి బాబురావును పోటీలో దింపుతున్నట్లు ప్రకటించడంతో పోటీ అనివార్యం కానుంది. చిన్న, చితకా పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను పోటీ చేయకుండా ఉంచేందుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని బుజ్జగించి నామినేషన్లు వేయకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ అవాక్కయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు మధ్య గట్టి పోటీ జరిగింది. తంగిరాల ప్రభాకరరావు 5212ఓట్లతో విజయం సాధించారు. కానీ అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మరణించారు. -
నందిగామలో వైఎస్ఆర్సీపీని నిలబెట్టొద్దు
-
నందిగామలో వైఎస్ఆర్సీపీని నిలబెట్టొద్దు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. నందిగామ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిని నిలబెట్టవద్దని ఆయన ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కోరారు. అయితే ఈ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఎన్నికల కమిషన్ ఆ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య పోటీ చేయనున్నారు. ఆమెను అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం ఎంపిక చేశారు. -
మోగిన ‘ఉప’ నగరా
నందిగామ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల 20 నుంచి 27 వరకు నామినేషన్ల స్వీకరణ 28న పరిశీలన 30 వరకు ఉపసంహరణకు గడువు సెప్టెంబర్ 13న ఎన్నికలు 16న ఫలితాలు విడుదల అమల్లోకి ఎన్నికల కోడ్ నందిగామ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు శనివారం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున 5,212 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయక ముందే గుండెపోటుకు గురై మరణించారు. దీంతో ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం నుంచి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఉప ఎన్నికపైనే చర్చ సాగుతోంది. ఇదీ షెడ్యూలు.. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 28వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 30వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 13వ తేదీన ఎన్నికలు నిర్వహించి 16న ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల ప్రకటన వెలువడటంతో జిల్లాలో కోడ్ అమల్లోకి వచ్చింది. టీడీపీలో ఆశావాహుల హడావుడి! ఉప ఎన్నికల్లో టికెట్ కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన ఆశావాహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టికెట్ తనకే లభిస్తుందని దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె తంగిరాల సౌమ్య భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఇటీవల ప్రచారం కూడా నిర్వహించారు. మరోవైపు గత ఎన్నికల్లో పామర్రు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన వర్ల రామయ్య కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వర్ల రామయ్యకు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారని సీఎంకు సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైనప్పటికీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై నోరుమెదపలేదు. సీఎం అభిప్రాయం కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు సమాచారం. పైకి మాత్రం తంగిరాల సౌమ్యకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెబుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీపై తీవ్ర వ్యతిరేకత టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయి. పథకం ప్రకారం వైఎస్సార్ సీపీ నేతలపై వేధింపులు కొనసాగిస్తున్నారు. ఆరు రోజులు కిందట టీడీపీ శ్రేణుల చేతిలో గొట్టుముక్కల ఉప సర్పంచి, వైఎస్సార్ సీపీ నాయకుడు ఆలోకం కృష్ణారావు హత్యకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండతోనే టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వరుస దాడుల నేపథ్యంలో టీడీపీపై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే విషయం కూడా స్పష్టంగా చెప్పకపోవడంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల వారికి అండగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గంలో టీడీపీ ఆగడాలను ఎదుర్కొంటున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అండగా నిలుస్తోంది. తమ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అందుబాటులో ఉంటున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన మూడు రోజుల కిందట గొట్టుముక్కల వచ్చి హత్యకు గురైన ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టీడీపీ ఆగడాలను స్థానిక నాయకులు వైఎస్ జగన్‌కు వివరించగా.. ఆయన అందరినీ ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్.. ఇలా అన్ని వర్గాల సమస్యలపైనా వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. -
కన్నీటి నివాళి
తంగిరాల కుటుంబాన్ని ఆదుకుంటామని చంద్రబాబు హామీ కడసారి చూపుకోసం తరలివచ్చిన అభిమానులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం జిల్లా వాసులను విస్మయానికి గురిచేసింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తంగిరాల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు, సంఘాల నేతలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు కన్నీటి నివాళి అర్పించారు. నందిగామ : దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. నందిగామ శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సోమవారం సీఎం చంద్రబాబు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి వివరాలను మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, మంత్రి దేవినేని ఉమాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు రాకతో కేవీఆర్ కళాశాల ప్రాంగణం భారీ జనంతో నిండిపోయింది. నందిగామలోని మథిర రోడ్డులో తంగిరాల అంత్యక్రియలు జరిగాయి. కడసారి చూపు కోసం జనం... తంగిరాల మృతి వార్త తెలియగానే ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రజలు భారీ ఎత్తున నియోజకవర్గ నలమూలల నుంచి తరలివచ్చారు. జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు మృతదేహాన్ని సందర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, టీడీపీ పార్టీకి చెందిన పలువురు మహిళలు ఆయన మృతదేహంపై పడి బోరున విలపించారు. నివాళులర్పించిన ప్రముఖులు..... బీసీ వెల్ఫేరు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ఎంపీలు కేశినేని నాని, మాగంటి బాబు, కొనకొళ్ల నారాయణ, చైర్ పర్సన్ అభ్యర్థిని గద్దె అనురాధ, ఎమ్మెల్యేలు బోండ ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్రావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వర్ల రామయ్య,తంగిరాల ప్రభాకరరావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. స్నేహశీలి తంగిరాల : వైఎస్సార్సీపీ నేత మొండితోక నిబద్ధత కలిగిన నాయకుడు, స్నేహశీలి తంగిరాల ప్రభాకరరావు అని, ఆయన హఠాన్మరణం ఎంతో బాధకలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. ఆయన మృతదేహాన్ని సోమవారం ఉదయం సందర్శించి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఆయనతో పాటు నియోజవకర్గ నాయకుడు కోవెలమూడి వెంకటనారాయణ, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు శ్రీ బొగ్గవరపు శ్రీ శైల వాసు, జిల్లా వాణిజ్య విభాగ కన్వీనర్ చల్లా బ్రహ్మాం, నాలుగు మండలాల కన్వీనర్లు నెలకుదిటి శివనాగేశ్వరరావు, బండి జానకీరామయ్య, కోటేరు ముత్తారెడ్డి, కోట బుచ్చయ్యచౌదరి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మంగునూరి కొండారెడ్డి, మున్సిపల్ కౌన్సలర్ మహ్మద్ మస్తాన్, ఎంఎస్.రాజశేఖర్, మాజీ ఏఎంసీ చైర్మన్ ముక్కపాటి నరసింహారావు, జిల్లేపల్లి రంగారావు, కుక్కల సత్యనారాయణ, మండల నాయకుడు వైఎస్ఎన్.ప్రసాద్ సందర్శించి నివాళులర్పించారు. మండలి సంతాపం అవనిగడ్డ : నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం పట్ల అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
తంగిరాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: బాబు
నందిగామ : టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు భౌతిక కాయానికి ఆపార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. చంద్రబాబు సోమవారం ఉదయం తంగిరాల భౌతిక కాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తంగిరాల మృతి పార్టీకి కృష్ణాజిల్లా ప్రజలకు తీరని లోటు అన్నారు. తంగిరాల మృతిని తాను జీర్ణించుకోలేక పోతున్నట్లు ఆయన తెలిపారు. క్రియాశీల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తంగిరాల పార్టీకి ఎనలేని సేవ చేశారన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు తంగిరాల కృషి చేశారని చంద్రబాబు ప్రశంసించారు. నిజాయితీకి తంగిరాల మారుపేరుగా నిలిచారన్నారు. కాగా ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు వెంటనే మదర్‌థెరిస్సా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 12 సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009లో తొలిసారిగా నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.