
కన్నీటి నివాళి
- తంగిరాల కుటుంబాన్ని ఆదుకుంటామని చంద్రబాబు హామీ
- కడసారి చూపుకోసం తరలివచ్చిన అభిమానులు
- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం జిల్లా వాసులను విస్మయానికి గురిచేసింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తంగిరాల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు, సంఘాల నేతలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు కన్నీటి నివాళి అర్పించారు.
నందిగామ : దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. నందిగామ శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సోమవారం సీఎం చంద్రబాబు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి వివరాలను మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, మంత్రి దేవినేని ఉమాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు రాకతో కేవీఆర్ కళాశాల ప్రాంగణం భారీ జనంతో నిండిపోయింది. నందిగామలోని మథిర రోడ్డులో తంగిరాల అంత్యక్రియలు జరిగాయి.
కడసారి చూపు కోసం జనం...
తంగిరాల మృతి వార్త తెలియగానే ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రజలు భారీ ఎత్తున నియోజకవర్గ నలమూలల నుంచి తరలివచ్చారు. జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు మృతదేహాన్ని సందర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, టీడీపీ పార్టీకి చెందిన పలువురు మహిళలు ఆయన మృతదేహంపై పడి బోరున విలపించారు.
నివాళులర్పించిన ప్రముఖులు.....
బీసీ వెల్ఫేరు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ఎంపీలు కేశినేని నాని, మాగంటి బాబు, కొనకొళ్ల నారాయణ, చైర్ పర్సన్ అభ్యర్థిని గద్దె అనురాధ, ఎమ్మెల్యేలు బోండ ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌రావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వర్ల రామయ్య,తంగిరాల ప్రభాకరరావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
స్నేహశీలి తంగిరాల : వైఎస్సార్‌సీపీ నేత మొండితోక
నిబద్ధత కలిగిన నాయకుడు, స్నేహశీలి తంగిరాల ప్రభాకరరావు అని, ఆయన హఠాన్మరణం ఎంతో బాధకలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు పేర్కొన్నారు. ఆయన మృతదేహాన్ని సోమవారం ఉదయం సందర్శించి పూలమాలలు వేసి నివాళుర్పించారు.
ఆయనతో పాటు నియోజవకర్గ నాయకుడు కోవెలమూడి వెంకటనారాయణ, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు శ్రీ బొగ్గవరపు శ్రీ శైల వాసు, జిల్లా వాణిజ్య విభాగ కన్వీనర్ చల్లా బ్రహ్మాం, నాలుగు మండలాల కన్వీనర్లు నెలకుదిటి శివనాగేశ్వరరావు, బండి జానకీరామయ్య, కోటేరు ముత్తారెడ్డి, కోట బుచ్చయ్యచౌదరి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మంగునూరి కొండారెడ్డి, మున్సిపల్ కౌన్సలర్ మహ్మద్ మస్తాన్, ఎంఎస్.రాజశేఖర్, మాజీ ఏఎంసీ చైర్మన్ ముక్కపాటి నరసింహారావు, జిల్లేపల్లి రంగారావు, కుక్కల సత్యనారాయణ, మండల నాయకుడు వైఎస్‌ఎన్.ప్రసాద్ సందర్శించి నివాళులర్పించారు.
మండలి సంతాపం
అవనిగడ్డ : నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం పట్ల అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.