- నందిగామ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
- 20 నుంచి 27 వరకు నామినేషన్ల స్వీకరణ
- 28న పరిశీలన
- 30 వరకు ఉపసంహరణకు గడువు
- సెప్టెంబర్ 13న ఎన్నికలు
- 16న ఫలితాలు విడుదల
- అమల్లోకి ఎన్నికల కోడ్
నందిగామ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు శనివారం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున 5,212 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయక ముందే గుండెపోటుకు గురై మరణించారు. దీంతో ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం నుంచి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఉప ఎన్నికపైనే చర్చ సాగుతోంది.
ఇదీ షెడ్యూలు..
ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 28వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 30వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 13వ తేదీన ఎన్నికలు నిర్వహించి 16న ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల ప్రకటన వెలువడటంతో జిల్లాలో కోడ్ అమల్లోకి వచ్చింది.
టీడీపీలో ఆశావాహుల హడావుడి!
ఉప ఎన్నికల్లో టికెట్ కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన ఆశావాహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టికెట్ తనకే లభిస్తుందని దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె తంగిరాల సౌమ్య భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఇటీవల ప్రచారం కూడా నిర్వహించారు. మరోవైపు గత ఎన్నికల్లో పామర్రు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన వర్ల రామయ్య కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
వర్ల రామయ్యకు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారని సీఎంకు సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైనప్పటికీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై నోరుమెదపలేదు. సీఎం అభిప్రాయం కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు సమాచారం. పైకి మాత్రం తంగిరాల సౌమ్యకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెబుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీపై తీవ్ర వ్యతిరేకత
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయి. పథకం ప్రకారం వైఎస్సార్ సీపీ నేతలపై వేధింపులు కొనసాగిస్తున్నారు. ఆరు రోజులు కిందట టీడీపీ శ్రేణుల చేతిలో గొట్టుముక్కల ఉప సర్పంచి, వైఎస్సార్ సీపీ నాయకుడు ఆలోకం కృష్ణారావు హత్యకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండతోనే టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వరుస దాడుల నేపథ్యంలో టీడీపీపై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే విషయం కూడా స్పష్టంగా చెప్పకపోవడంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అన్ని వర్గాల వారికి అండగా వైఎస్సార్ సీపీ
నియోజకవర్గంలో టీడీపీ ఆగడాలను ఎదుర్కొంటున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అండగా నిలుస్తోంది. తమ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అందుబాటులో ఉంటున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన మూడు రోజుల కిందట గొట్టుముక్కల వచ్చి హత్యకు గురైన ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో టీడీపీ ఆగడాలను స్థానిక నాయకులు వైఎస్ జగన్‌కు వివరించగా.. ఆయన అందరినీ ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇలా అన్ని వర్గాల సమస్యలపైనా వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయం రసవత్తరంగా మారింది.