కాంగ్రెస్.. రెబల్ డ్రామా | Congress party plays rebel hi drama for Rajya sabha elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్.. రెబల్ డ్రామా

Published Fri, Feb 7 2014 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్.. రెబల్ డ్రామా - Sakshi

కాంగ్రెస్.. రెబల్ డ్రామా

' టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపునకు మార్గం సుగమం చేసిన సీఎం కిరణ్
' రాజ్యసభ బరిలోంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేసిన ఆదాల
' విరమణ వెనుక భారీ ప్యాకేజీ, లావాదేవీలు జరిగినట్టు సమాచారం
' వైఎస్సార్ సీపీ సహకరించని కారణంగా వైదొలుగుతున్నట్టు ఆదాల ప్రకటన
' నామినేషన్ల పర్వం ప్రారంభం కాకముందే ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
 
 సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిని రంగంలోకి దింపి ఇంతకాలం హైడ్రామా నడిపిన కాంగ్రెస్ బండారం బయటపడింది. సమైక్యవాదం కోసమంటూ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డిని పోలింగ్‌కు ఒకరోజు ముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. బరి నుంచి వైదొలిగేలా చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఆదాల గురువారం ప్రకటన చేశారు. ఆయన గురువారం ఎమ్మెల్యేలు జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీధర్‌కృష్ణారెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. పోటీనుంచి తప్పుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జేసీ, శ్రీధర్‌కృష్ణారెడ్డిలతో కలిసి సీఎల్పీ కార్యాలయం వద్దకు చేరుకుని తాను పోటీనుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించారు.
 
  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సహకరించబోమన్నారని, అందువల్లే బరినుంచి తప్పుకుంటున్నానని ఆదాల చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విలేక రులడిగిన పలు ప్రశ్నలకు జవాబు చెప్పకుండా పక్కనున్న జేసీని మాట్లాడాలంటూ సూచించి పక్కకు తప్పుకున్నారు. ఎన్నికల్లో సమైక్యవాదులంతా తనకు ఓటు వేస్తారని, 42 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పిన ఆదాల చివరి నిమిషంలో ఇలా తప్పుకోవడానికిగాను భారీ ప్యాకేజీలతో అవగాహన కుదిరినట్టు సమాచారం. మరోవైపు టీఆర్‌ఎస్ అభ్యర్థి కె. కేశవరావు గెలుపునకు ముఖ్యమంత్రి మార్గం సుగమం చేయడంతో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
 
 ప్యాకేజీలో.. రికవరీ మాఫీ
     ఆదాల నెల్లూరు జిల్లాలోని ఒక ప్రాజెక్టు అధునీకరణ పనుల కాంట్రాక్టు పొందగా, ఆ పనులు నాసిరకంగా ఉన్నాయని, దానిపై చెల్లించిన మొత్తంలో రూ.25 కోట్లను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాల్సిందిగా విజిలెన్స్ నిగ్గుతేల్చిందని చెబుతున్నారు. ఇప్పుడు రాజ్యసభ బరిలో నుంచి తప్పుకోవడం ద్వారా ఆ రికవరీని మాఫీ చేయడానికి అంగీకారం కుదిరిందని సమాచారం.
     అలాగే జిల్లాలో వరద నివారణకు సంబంధించి రూ.68 కోట్ల విలువైన ఎత్తిపోతల పథకాన్ని నామినేషన్‌పై కట్టబెట్టడానికి కూడా అవగాహనకొచ్చారని కాంగ్రెస్‌లో బలంగా వినిపిస్తోంది. ఎత్తిపోతల ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉందని సమాచారం.
 
 మొదటి నుంచి ప్లాన్ ప్రకారమే...

 అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ సాగుతున్న తరుణంలో సమైక్యవాదం కోసం పోరాడుతున్నట్లు ఎమ్మెల్యేలను భ్రమల్లో ఉంచడం, చివరి నిమిషంలో రంగం నుంచి తప్పించడం ద్వారా సీఎం రెండు రకాల ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ఆదాలతో రెబల్‌గా నామినేషన్ వేయించారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే తనకు 20 మంది ఎమ్మెల్యేల బలం ఉందని స్వతంత్ర ఎమ్మెల్సీ చైతన్యరాజు నామినేషన్ వే యడంతో సీఎం ఇరకాటంలో పడ్డారు. చైతన్యరాజు బరిలో ఉంటే చివర్లో పోటీనుంచి తప్పుకొనే పరిస్థితి ఉండదని, దీంతో ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చారు. దీంతో పార్టీ రెబెల్ అభ్యర్థి ఆదాలను తప్పించే బదులు పార్టీకి సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థి బరి నుంచి వైదొలగేలా చేయడానికి ఆయన అనేకరకాల ఒత్తిళ్లు చేశారని అంటున్నారు.
 
 నెపం వైఎస్సార్ కాంగ్రెస్‌పై..
  -   ప్రాజెక్టు ప్యాకేజీల విషయం బయటికి రాకుండా ఆదాలను తప్పించే విషయంలో వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ నేతలు నిందను వైఎస్సార్ కాంగ్రెస్‌పై నెట్టేందుకు ప్రయత్నించినట్టు స్పష్టమైంది.
-     వాస్తవానికి సంఖ్యాబలంలేనందున తాము పోటీ చేయబోమని, ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వబోమని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రకటించింది. పైగా ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేసింది.
 -   గురువారం ఉదయం సీఎం తన క్యాంపు కార్యాలయంలో తన పార్టీకి చెందిన 27 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు వీలుగా పోటీ నుంచి తప్పుకోవాలని, వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం వల్లనే తాను వైదొలగుతున్నట్లు చెప్పాలని ఆదాలకు సీఎం ఈ సమావేశంలో సూచించినట్లు సమాచారం.
  -   ఈ సమావేశంలోనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సీఎం ఫోన్లో సంప్రదింపులు జరిపి వారిచ్చిన సూచనల మేరకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
-     ఆదాలకు ఓటు వేయాలని పార్టీ ఎమ్మెల్యేలను అడిగితే సీఎం చెబితే వేస్తామంటున్నారని, సీఎం మాత్రం ఆదాలనే తప్పుకోమని చెబుతున్నారని సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి సీఎల్పీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పేర్కొన్నారు. కాగా, ఎవరు ఎవరికి ఓటు వేయాలన్నదానిపై శుక్ర వారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన తేనీటి విందులో సీఎం వివరించనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.
- అదనపు ఓట్లు కేకేకు: సీఎం సహాతెలంగాణ నేతలతో చర్చించిన అధిష్టానం అదనపు ఓట్లను టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనధికారికంగా కేటాయించేలా సూచనలు అందించినట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement