కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలి: నరేంద్ర మోడీ
కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలి: నరేంద్ర మోడీ
Published Mon, Aug 12 2013 1:38 AM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM
కాంగ్రెస్ వైఖరి వల్లే తెలంగాణ, సీమాంధ్ర ప్రజల్లో పరస్పర విద్వేషాలు తలెత్తాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల ప్రచార కమిటీ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ వైఖరి వల్ల ఉభయ ప్రాంతాల మధ్య విద్వేషాలు ప్రజ్వరిల్లాయి. ఒకర్ని ఒకరు కొట్టుకు చావాల్సి వస్తోంది. ఈ విద్వేషాల పాపం కాంగ్రెస్‌దే’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘తెలంగాణవాసులు, సీమాంధ్రులు సోదరులు. అదేవిధంగా మెలగాలి. అన్నదమ్ములు ద్వేషించుకోవద్దు. ఆంధ్రా ఎంతో తెలంగాణ కూడా అంతే. ఇరు ప్రాంతాలూ అభివృద్ధిలో గుజరాత్‌ను మించిపోవాలన్నది నా ఆకాంక్ష’’ అన్నారు. హైదరాబాద్‌లో ఎంత అభివృద్ధి జరిగిందో సీమాంధ్రలోనూ అంతే అభివృద్ధి జరగాలన్నారు. సర్వానర్థాలకూ మూలం కాంగ్రెసేనంటూ మండిపడ్డారు. ఆ పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ రహిత భారతదేశమే నా స్వప్నం. అభివృద్ధే అన్ని సమస్యలకూ పరిష్కారం. అందరికీ అన్నీ, అందరితోనే అభివృద్ధి అనేదే మా నినాదం’ అన్నారు. సార్వత్రిక ఎన్నికల లోపు 100 సదస్సులు నిర్వహించాలన్న బీజేపీ నిర్ణయంలో భాగంగా ఆదివారం ఇక్కడ ఎల్బీ స్టేడియంలో జరిగిన తొలి భారీ బహిరంగ సదస్సు ‘నవభారత యువభేరి’లో మోడీ పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా వచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ముందుగా తెలుగులో మొదలుపెట్టి, తెలంగాణ ఏర్పాటుతో సహా పలు జాతీయ సమస్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ వైఖరిని దునుమాడారు. ‘‘దాని అవినీతికి హద్దుల్లేకుండా పోయాయి. గాలి,నీరు, భూమి, ఆకాశం అన్నింటికీ అవినీతి మకిలి అంటింది’’ అంటూ తూర్పారబట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. యువకులు, పేదలు, రైతులు.. ఇలా అన్ని వర్గాలూ కాంగ్రెస్‌ను పారదోలాలన్న సంకల్పంతో ఉన్నాయని చెప్పారు.
అచేతనావస్థలో కేంద్రం...
కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అచేతనావస్థలో ఉందంటూ మోడీ ధ్వజమెత్తారు. ‘‘పాక్ సైనికులు మన సైనికుల తలలు నరుక్కుపోయినా, కాశ్మీర్‌లో తెగబడినా, బంగ్లాదేశీయులు భారత్ భూభాగంలోకి అక్రమంగా చొరబడుతున్నా, చైనా సైన్యాలు మన భూభాగంలోకి వచ్చినా ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దౌర్భాగ్యం. చైనా వెళ్లిన రక్షణ మంత్రి, ‘బీజింగ్ చాలా ఆహ్లాదంగా ఉంది, ఇక్కడే ఉండాలనిపిస్తోంది’ అనడం, మరో మంత్రి పాక్ సైనికులకు బిర్యానీలు వడ్డించి ‘ప్రొటోకాల్’ అనడం, అక్రమ చొరబాటుదారులపై ఆయుధాలు ఎత్తొద్దనడం విడ్డూరం. ఇలాంటి నేతలు 120 కోట్ల మంది పౌరులకు ఏం భరోసా కల్పిస్తారు? కేరళ మత్స్యకారులపై కాల్పులు జరిపిన ఇద్దరు ఇటలీ సైనికులను అరెస్టు చేసేందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. భారతీయులకు చిన్నా చితకా కేసుల్లో కూడా బెయిలే దొరకదు. కానీ ఇటలీ సైనికులకు మాత్రం బెయిల్ వచ్చింది’’ అంటూ ఎద్దేవా చేశారు.
విభజించి పాలించడమే కాంగ్రెస్ నైజం
దేశ సమస్యలపై కాంగ్రెస్‌కు పట్టింపే లేదని మోడీ అన్నారు. యువత ఈ దేశ భవిష్యత్తుపై ఆందోళన, ఆవేదన చెందుతుంటే తాను మాత్రం యువత గురించి ఆందోళన చెందుతున్నానన్నారు. ‘‘ఆహార కొరతతో యువత అల్లాడుతోందని, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్‌ల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే యువకుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ దుర్గతికి కాంగ్రెసే కారణం. దానిది విభజించి పాలించే నీతి. తెలంగాణపై 2004లోనే కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఏం జరిగింది? ఏపీ నుంచే కాంగ్రెస్ అత్యధికంగా లోక్‌సభ సీట్లను గెలిచి, వాటి సాయంతో అధికారంలోకి వచ్చింది. ఇంతకాలం తర్వాత ఇప్పుడు విభజన నిర్ణయాన్ని ప్రకటిస్తే ఉభయ ప్రాంతాల మధ్య విద్వేషాలు ప్రజ్వరిల్లాయి. వాజపేయి హయాంలో మేమూ మూడు రాష్ట్రాలిచ్చాం. ఎక్కడా ఎలాంటి విద్వేషాలూ చెలరేగలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఉభయులూ మిఠాయిలు పంచుకున్నారు’’ అన్నారు. ‘‘హైదరాబాద్ మాదిరే సీమాంధ్ర కూడా అభివృద్ధి చెందాలి. ఇక్కడ దొరికే సకల సదుపాయాలూ అక్కడా ఉండాలి. హైదరాబాద్ కంటే దీటైన రాజధాని సీమాంధ్రలోనూ రావాలి. కానీ ఢిల్లీ సర్కారుకు అంత తీరిక లేదు. పదేళ్లుగా (2004 నుంచి) రెండో రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఆనాడే ఎందుకు చేపట్టలేదు? రెండు ప్రాంతాలు మహత్తరంగా అభివృద్ధి చెందాలి. ఏ ఒక్కరికీ అన్యాయం జరగడానికి వీల్లేదు. నేను చాలా చిన్నవాణ్ని. గాంధీ, సర్దార్ పటేల్ వంటి మహనీయులు జన్మించిన గుజరాత్ భూమి నుంచి వచ్చా. సూరత్‌లో 4 లక్షలు, అహ్మదాబాద్‌లో 6 లక్షల మంది తెలుగు వారున్నారు. మేం అన్నదమ్ముల్లా సహజీవనం సాగిస్తున్నాం. కాంగ్రెస్ ఇక్కడేం చేస్తోంది? ఎన్నెన్నో నాటకాలు ఆడుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే నా మనసు కలత చెందింది. సోదరులుగా విడిపోవాలి. తల్లిపాలలో స్వచ్ఛతను అనుమానిస్తామా? తేడా ఉండకూడదు’’ అని మోడీ చెప్పారు.
కాంగ్రెస్ విరోధి ఎన్టీఆర్: ఆంధ్రప్రదేశ్‌కు వస్తే ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకోలేకుండా ఉండలేనని మోడీ అన్నారు. ‘‘కాంగ్రెస్‌కు బద్ధ శత్రువైన ఎన్టీఆర్, ఢిల్లీనే గడగడలాడించారు. ఢిల్లీలో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపారు. కాంగ్రెస్‌ను దేశం నుంచి తరిమికొట్టి విముక్తం చేయడమే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి. ఇందుకు పార్టీలన్నీ కలిసి రావాలి. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ లేకుండా చేయాలి. ఎన్టీఆర్ వారసులమని చెప్పే టీడీపీ, ఆయన కలల పరిపూర్తికి కాంగ్రెస్‌పై పోరాడాలి. వాళ్లపై ఆ కర్తవ్యం ఉంది. ఎవరు కలిసొచ్చినా రాకపోయినా కాంగ్రెస్ రహిత భారత్‌ను నిర్మించడమే నా కల’’ అని చెప్పారు.
నైపుణ్యం పెంచే తీరిదేనా?: దేశానికి కాంగ్రెస్ భారంగా మారిందని మోడీ అన్నారు. దాని జులుం, అవినీతితో దేశం భ్రష్టు పట్టిందన్నారు. ‘‘కాంగ్రెస్ పాలనలో తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టడానికి బట్ట, చదువుకోవడానికి బడి, రోగమొస్తే ఔషధం కూడా కరువయ్యాయి. దేశ చరిత్రను మార్చే శక్తి సామర్థ్యాలు, ప్రగతి పునాదులు వేసే నవభారత నిర్మాతలు యువకులే. అన్ని వర్గాల సంక్షేమాన్ని చూసేది బీజేపీ మాత్రమే. వాజపేయి హయాంలో ఏనాడూ తిండికి కొరత రాలేదు. కాంగ్రెస్ వచ్చి పేదల పళ్లెంలోని రొట్టెను లాక్కోవడం వల్లే ఆహార భద్రత గురించి ఆలోచించాల్సి వస్తోంది. పదేళ్ల పంచవర్షప్రణాళికల్లో ఎన్నడూ కనిపించని సమ్మిళిత అభివృద్ధి అనే పదం యూపీఏ హయాంలోనే తెర మీదకు వచ్చింది. యువతలో నైపుణ్యాభివృద్ధికి అనేక అవకాశాలున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విదేశీ బ్యాంకుల్లో నల్ల ధనాన్ని వెనక్కు తెచ్చేందుకూ వెనకాడుతోంది. గుజరాత్‌తో పోల్చుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈర్ష్యగా అన్పిస్తే తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను చూసైనా నేర్చుకోవచ్చుగా! స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో డాలర్‌తో సమానంగా ఉన్న మన రూపాయి విలువ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి వయసుతో సమానంగా ఉంది. బుద్ధి జీవుల వలసల వల్ల ధనలక్ష్మి కూడా వెళ్లిపోతోంది. సుమారు రూ.1.2 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోయాం’’ అని చెప్పారు.
సభికులతో నినాదాలు...: అందరికీ అన్ని, అందరితోనే అందరి అభివృద్ధి అంటూ మోడీ నినదించారు. ‘ఔను.. మేం సాధించగలం, మేం చేయగలం’ అంటూ సభికులతోనూ నినాదాలు చేయించారు. జెతైలంగాణ, జై సీమాంధ్ర, భారత్ మాతాకీ జై, వందేమాతరం అని వారితో అనిపించారు. సదస్సు ద్వారా వచ్చిన రూ.10 లక్షల విరాళాల చెక్కును బీజేపీ జాతీయ నాయకుడు సతీష్‌జీ అగర్వాల్‌కు పార్టీ కోశాధికారి మనోహర్‌రెడ్డి అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీనియర్ నేతలు ఎం.వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దనరెడ్డి, బంగారు లక్ష్మణ్, వి.రామారావు, నిర్మలా సీతారామన్, డాక్టర్ హరిబాబు, శాంతారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్వం మోడీమయం!
బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన సదస్సు సర్వం మోడీమయంగా సాగింది! ఆ పార్టీలోని ఇతర అగ్రనేతల ఊసే కన్పించలేదు! హైదరాబాద్ అంతటా జాతీయ, రాష్ట్ర నేతలు ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు కన్పించినా, సదస్సు జరిగిన ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో మాత్రం అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా ఎవరి ఫొటోలూ కన్పించలేదు. ఏర్పాటు చేసిన రెండు పెద్ద వేదికలపైనా మోడీ ఫొటోలతో కూడిన బ్యానర్లనే ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద, వల్లభాయ్ పటేల్ నిలువెత్తు కటౌట్లు, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్‌సింగ్, తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ తదితరుల చిత్రపటాలను ప్రదర్శించారు. దేశభక్తి సూక్తుల బ్యానర్లపైనా మోడీయే దర్శనమిచ్చారు. సభకు హాజరైన ప్రతినిధులు, కార్యకర్తలు కూడా మోడీ అనుకూల నినాదాలకే పరిమితమయ్యారు
తెలుగులో మొదలెట్టిన మోడీ
‘సోదర, సోదరీమణులారా! నమస్కారం’ అంటూ మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టి ఆకట్టుకున్నారు. ‘‘దేశ ప్రగతికి తెలుగు వారి కృషి ప్రశంసనీయం. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యాలతో ఉండాలని తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలు త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధి ఇవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. గుజరాత్‌తో తెలుగువారి సత్సంబంధాలు చాలా ప్రాచీనమైనవి. కాబట్టే మా రాష్ట్రంలో తెలుగు మీడియం స్కూళ్లున్నాయి. సర్దార్ పటేల్ ద్వారా హైదరాబాద్ ప్రాంత ప్రజలకు సేవలు అందాయి. 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ రోజును హైదరాబాద్ విముక్తి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యాదృచ్ఛికమే అయినా నా జన్మదినం కూడా అదే’’ అంటూ తెలుగులో మాట్లాడారు!
అభిమానులకు పాదాభివందనం
85 ఏళ్ల వయసులోనూ తనపై అభిమానంతో పంజాబ్ నుంచి వచ్చిన మేరీ బెల్ అనే వృద్ధురాలిని, 86 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు ఇంద్రసేనారెడ్డిని మోడీ ప్రత్యేకంగా వేదికపైకి పిలిపించుకుని పాదాభివందనం చేశారు. వారిని చూస్తుంటే దేశ భవిష్యత్తుపై వారికున్న ఆవేదన, ఆందోళన అర్థమవుతున్నాయన్నారు. ఇది తన జీవితంలో చాలా ముఖ్య ఘట్టమని చెప్పారు. ‘సభా ప్రాంగణంలోని వారి కన్నా రెండింతల మంది బయట ఉన్నారు. వారికి స్టేడియంలో చోటు లేకపోయినా నా హృదయంలో చాలా స్థలముంది. నేను మళ్లీ వస్తానని హామీ ఇస్తున్నా. మీ అందర్నీ ప్రత్యక్షంగా చూస్తా’ అంటూ ఆకట్టుకున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితులకు సాయం చేయాలనే సదుద్దేశంతో 5 రూపాయల రుసుం చెల్లించి సదస్సుకు వచ్చిన రాష్ట్ర యువత అభినందనీయులన్నారు.
Advertisement
Advertisement