కాంగ్రెస్‌వి కపట నాటకాలు: నారాయణ
తిరుపతి: రాష్ట్ర విభజన విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. తిరుపతిలోని ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఐ గతంలో సూచించిన విధంగా తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించి ఉంటే ఉద్యమం వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిద్రపోయి జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పదవులు, లెసైన్సులు, కాంట్రాక్టుల కోసం సోనియా గాంధీ కాళ్లపై సాగిలపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించే ముందు సీమాంధ్రకు ఎలాంటి న్యాయం చేస్తారో, విభజన అనంతరం తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తారో ప్రకటించి ఇక్కడి ప్రజల్లో భయాందోళనలను తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు.