సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనపడింది: బొత్స
విశాఖ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజా వ్యతిరేకత తప్పదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో 75శాతం మంది ప్రజలు కోరుకుంటున్నందునే కేంద్రం రాష్ట్ర విభజనకు సిద్ధపడిందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ విలీనంపై తన దగ్దర ఎలాంటి సమాచారం లేదని బొత్స అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము చివరి వరకూ ప్రయత్నం చేస్తామన్నారు. విభజన ప్రకటనతో సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు.
రాజ్యాంగ బద్దంగానే విభజన ప్రక్రియ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.అయితే అది త్వరలో పూర్తవుతుందని తాను అనుకోవటం లేదన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగానే అధిష్టానం వ్యవహరిస్తున్నట్లు బొత్స తెలిపారు. కాగా బొత్స సత్యనారాయణతో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం విశాఖలో సమావేశం అయ్యారు.అంతకు ముందు బొత్సా.. తమిళనాడు గవర్నర్ రోశయ్యతో భేటీ అయ్యి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.