- దుర్గంథంతో పట్టణాలు సతమతం
- పల్లెల్లో కొరవడిన పారిశుద్ధ్యం
- ఏజెన్సీలో అనారోగ్యకర పరిస్థితులు
- క్లోరినేషన్‌కు నోచుకోని తాగునీటి వనరులు
యలమంచిలి, న్యూస్‌లైన్: జిల్లాలో పారిశుద్ధ్యం కొరవడింది. పట్టణాలు, పల్లెలు గబ్బుకొడుతున్నాయి. అడపాదడపా వర్షాలతో పరిస్థితి దయనీయంగా మారుతోంది. వాతావరణంలో మార్పులతో వ్యాధులు కమ్ముకుంటున్నాయి. మన్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూడేళ్ల క్రితం మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన నర్సీపట్నం, యలమంచిలిలో సమస్యలు రెట్టింపయ్యాయి. రెండింటా విలీన గ్రామాలప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులతోపాటు పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
పురపాలికలుగా రూ పాంతరం చెందినప్పటికీ పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కాలేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. యలమంచిలి, నర్సీపట్నంల్లో పారిశుద్ధ్యం కొరవడింది. రెండింట 15 టన్నుల వరకు చెత్త ఉంటోంది. ఒక్కో పట్టణంలో సుమారు 50 మంది మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారితో పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు.
రెండు ట్రాక్టర్లు, రెండు ఆటోల ద్వారా కేవలం 8నుంచి 9 టన్నుల చెత్త మాత్రమే తొలగిస్తున్నారు. మిగిలిన చెత్త వీధుల్లో , కాలువల్లో గుట్టల కొద్దీ దర్శనమిస్తోంది. తాగునీటి సమస్యనూ ఆయా పట్టణ వాసులు ఎదుర్కొంటున్నారు. నర్సీపట్నం వాసులను డంపింగ్ యార్డు సమస్య ఏళ్లతరబడి పట్టి పీడిస్తోంది. అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం రైతు బజార్ వద్ద పందుల స్వైర విహారంతో జనం ఇబ్బం దులు పడుతున్నారు. వ్యాధులకు గురైయ్యే ప్రమాదముందని వాపోతున్నారు. రోడ్డపై వేస్తున్న చెత్తను ఎప్పటి కప్పుడు తొలగించకపోవడంతో వాటిని తినడానికి పందులు చేరుతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది.
కొత్తపాలకవర్గాలపై కోటిఆశలు...
నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన కొత్త పాలకవర్గాలపై ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. పురపాలికల్లో పేరుకుపేయిన సమస్యలు కొత్తపాలకవర్గాలు పరిష్కరిస్తాయన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
గ్రామాల్లో..
మైదానంలోని గ్రామీణుల్లోనూ చైతన్యం కొరవడుతోంది. ఇళ్లల్లో ఊడ్చిన చెత్తను తెచ్చి రోడ్లపై పోస్తున్నారు. అవి ఎక్కడికక్కడ కుప్పులుగా పేరుకుపోతున్నాయి. వర్షాలకు కుళ్లి దుర్గంధం వెలువడుతోంది. తాగునీటి క్లోరినేషన్ కూడా చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు.
ఏజెన్సీలో...
ఏజెన్సీలో రోజూ వర్షాలు పడుతున్నాయి. తాగునీరు కలుషితమవుతోంది. పంచాయతీల పాలకులకు, అధికారులకు ఇది పట్టడం లేదు.
దీంతో అనారోగ్యకర పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో గిరిజనులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు.