- వైఎస్సార్‌సీపీ విద్యార్థి సమైక్య శంఖారావంలో వక్తలు
- కిరణ్ , చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో సమైక్యం కోసం శాయశక్తులా కృషిచేస్తున్నది వైఎస్ జగనేనని... ఆయనే సమైక్య చాంపియన్ అని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి సమైక్య శంఖారావం సభ బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి సమైక్య నినాదాలు చేశారు.
ఈ సభకు జిల్లా విద్యార్థి జేఏసీ నాయకుడు అంజిరెడ్డి అధ్యక్షత వహించారు. సభలో నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన ముసుగులో సమైక్యం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విభజన వాదమా? సమైక్యమా? అనే విషయాన్ని ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే సమైక్యం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. 1969లో చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని ఇందిర ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. వేర్పాటువాదాన్ని ఆమె ప్రోత్సహించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఏనాడూ విభజన కోరలేదని, కేవలం కన్నతండ్రిలా న్యాయం చేయాలని మాత్రమే సూచించిందని వివరించారు.
సమైక్యంగా ఉంటేనే హైదరాబాద్‌లో అవకాశాలు...
పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే హైదరాబాద్‌లో అందరికీ అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగాలని వైఎస్సార్‌సీపీ కోరుకుంటోందన్నారు. సమైక్యం కోసం జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యార్థులకు భవిష్యత్తు ఇచ్చింది వైఎస్సేనన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్ మాట్లాడుతూ విభజనకు బీజం వేసింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. చిన్న రాష్ట్రాలుంటే కేంద్రం లెక్కచేయదన్నారు.
సమన్వయకర్తలు పి.గౌతంరెడ్డి, పడమటి సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులతోనే రాజకీయాల్లో మార్పులు వస్తాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డితో విద్యార్థులు కలిసి రావాలన్నారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. నగర మాజీ మేయర్ తాడి శకుంతల, వాణిజ్య విభాగం నాయకుడు కొణిజేటి రమేష్, డాక్టర్ల విభాగం కన్వీనర్ మహబూబ్, నాయకులు కాకర్ల వెంకటరత్నం, రామలింగమూర్తి, ఎం.ఎస్.నారాయణ, నారుమంచి నారాయణ, టి.హేమంతరావు తదితరులు పాల్గొన్నారు.