వేముల, న్యూస్‌లైన్ : తాగునీరు కలుషితం కావడంపై ఆ గ్రామస్తులు కన్నెర్ర జేశారు. యురేనియం తవ్వకాలే తాగునీరు కలుషితానికి కారణమని భావించిన వారు యురేనియం ప్రతినిధులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విచారణ కోసం గ్రామంలోకి వచ్చిన ప్రతినిధుల వాహనాన్ని అడ్డుకున్నారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకు కదలడానికి వీల్లేదని భీష్మించారు. వేముల మండలం మబ్బుచింతలపల్లెలోని బోరు నుంచి 20 రోజులుగా తాగునీరు కలుషితమై వస్తోంది. గ్రామంలో మూడు నీటి పథకాలు ఉండగా, తాగునీటి పథకానికి సంబంధించిన బోరు నుంచి కలుషిత నీరు వస్తోంది.
బోరు లోతులో ఉండడంతో ఇలా వస్తోందని తొలుత భావించిన గ్రామస్తులు లోతు తగ్గించారు. అయినా వ్యర్థాలతో కూడిన నీరే రావడంతో వారికి యురేనియం తవ్వకాలపై అనుమానం కలిగింది. తవ్వకాల వల్లే నీరు కలుషితమవుతోందని ఆందోళన చెందిన గ్రామస్తులు ఈ విషయాన్ని యురేనియం సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ కోసం యురేనియం సంస్థ మైనింగ్ మేనేజర్ కేకే రావు, మైనింగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ భద్రదాస్, బీకే రాణా మంగళవారం గ్రామానికి వెళ్లారు. పరిస్థితిని పరిశీలించారు. అక్కడి నుంచి వెనుదిరుగుతుండగా గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ పర్సనల్ మేనేజర్ అలీ ఇక్కడికి చేరుకుని గ్రామస్తుల తో చర్చించారు. పది రోజుల పాటు ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తామని, ఆలోగా బోరు నీటిని పరీక్షల నిమిత్తం పంపి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
తాగునీరు కలుషితంపై కన్నెర్ర
Published Wed, Dec 25 2013 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement