అభివృద్ధికి పట్టణీకరణ దోహదం
బ్రిక్స్ సదస్సు ప్రారంభోపన్యాసంలో వెంకయ్యనాయుడు
సాక్షి, విశాఖపట్నం: దేశాల అభివృద్ధికి పట్టణీకరణ ఎంతో దోహదం చేస్తుందని, అదే సమయంలో ఎదురయ్యే సవాళ్లను కూడా ఎదుర్కోవాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పట్టణీకరణ లో వచ్చే తలసరి ఆదాయానికి, అక్కడ మౌలిక వసతుల కల్పనకు మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉందని, బ్రిక్స్ దేశాలు వీటికి పరిష్కార మార్గాలను చూపాలని సూచించారు. ఇక్కడి నోవాటెల్ హోటల్‌లో బుధవారం పట్టణీకరణపై బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధానోపన్యాసం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు విద్య, ఉపాధి, ఆరోగ్యం తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. 2011 నాటికి 32 శాతం ఉన్న పట్టణీకరణ 2050 నాటికి 70 శాతానికి పెరుగుతుందని చెప్పారు.
దేశంలో 2011లో పట్టణ జనాభా 377 మిలియన్లు ఉండగా రానున్న 15 ఏళ్లలో 600 మిలియన్లకు చేరుకుంటుందన్నారు. బ్రిక్స్ దేశాలన్నింటిలో భారత్‌లోనే తక్కువ పట్టణీకరణ జరుగుతోందని తెలిపారు. గృహ నిర్మాణంలో చైనా, స్పెషల్ పర్పస్ వెహికల్ యాజమాన్యంలో బ్రెజిల్, పెద్ద నగరాల నిర్మాణంలో రష్యా అనుభవాలను భారతదేశం పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు. పట్టణీకరణ వేగవంతం కావడానికి స్థానిక సంస్థలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని, ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ.15,827 కోట్లు అందిస్తుందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పట్టణీకరణతో పాటే సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయన్నారు. గృహ, విద్య, వైద్య తదితర అంశాలు సమస్యాత్మకమవుతున్నాయని చెప్పారు. మంచి ప్రణాళికలతో ఉత్తమ ప్రమాణాలు గల జీవనానికి వీలు కల్పించాలని బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు సూచించారు.