వరంగల్, అమరావతిలకు మహర్దశ
- వారసత్వ నగరాలుగా ఎంపిక
- జాబితాలో 12 నగరాలు
- రూ.500 కోట్లతో పునరుత్తేజం
- కేంద్ర మంత్రి వెంకయ్య వెల్లడి
న్యూఢిల్లీ: పురాతన నగరాలను పరిరక్షించడంతోపాటు వాటికి పునరుత్తేజం కల్పించడానికి కేంద్రం నడుం బిగించింది. వారసత్వ నగరాల అభివృద్ధి కోసం వచ్చే ఏడాది నుంచి కొత్త ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీనికి రూ.500 కోట్ల వ్యయం చేయనున్నట్లు శనివారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పారు.
‘జాతీయ వారసత్వ నగరాభివృద్ధి యోజన’ పేరుతో తెస్తున్న ఈ ప్రాజెక్టును తొలుత దేశంలోని 12 నగరాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ వారసత్వ నగరాల జాబితాలో తెలంగాణ నుంచి వరంగల్, ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతితోపాటు అమృత్‌సర్, వారణాసి, గయ, పూరి, అజ్మీర్, వేలాంగణి, మథుర, కాంచీపురం, ద్వారకా, బదామి ఉన్నాయి.
సాంస్కృతికపరంగా, ధార్మికపరంగా ఘనమైన వైవిధ్య వారసత్వానికి ప్రతీకగా నిలిచిన నగరాలను ఈ ప్రాజెక్టుకు ఎంపికచేసినట్లు వెంకయ్య చెప్పారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ జాబితాలోకి మరిన్ని నగరాలను చేరుస్తామని పేర్కొన్నారు. ఈ నగరాల్లో వారసత్వ, పర్యాటక రంగాలకు ప్రోత్సాహకం కల్పిస్తామని తెలిపారు.
మన ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు, మన పూర్వీకుల ఘనతను వచ్చే తరాలకు అందించడమే తమ ధ్యేయమన్నారు. వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టు మొదటి దశ మూడు నుంచి ఐదేళ్ల వ్యవధితో ఉంటుందని మంత్రి చెప్పారు. దీనికి ఆయా నగరాలు సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, నిధులన్నింటినీ కేంద్రమే ఇస్తుందని వివరించారు. ఇందులో పౌరుల భాగస్వామ్యం కీలకం కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యానికీ అవకాశం కల్పిస్తామన్నారు.