
సీపీఎస్‌ను రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇస్తున్న జగన్
సాక్షి, పర్చూరు/మార్కాపురం టౌన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్). కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను కలవరపెడుతున్న అంశం. ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితాన్ని ప్రశ్నార్థకం చేసే ఈ విధానంతో భద్రత లేని వృద్ధాప్యాన్ని తలచుకుని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అనేక పోరాటాలతో ప్రభుత్వ ఉద్యోగులు సాధించిన పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకేఒక్క ఉత్తర్వుతో రద్దు చేయడంపై మండిపడుతున్నారు. 2004 జనవరి 1 నుంచి కొత్త పెన్షన్ విధానానికి (సీపీఎస్) తెరలేపడం, అదే ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సీపీఎస్‌ను అమల్లోకి తేవడం తెలిసిందే. అప్పటి నుంచే ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో సీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం డెత్ గ్రాడ్యుటీ మంజూరు చేస్తున్నట్లు జీఓ ఇచ్చినప్పటికీ అందులో అనేక లోపాలుండటంతో ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తంమీద 500 మందికిపైగా చనిపోయిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో సీపీఎస్ వద్దని, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న జగన్...
సీపీఎస్‌తో జరుగుతున్న నష్టంపై ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమలు చేస్తామని ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఇచ్చారు. జగన్ హామీతో సీపీఎస్ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తమ సమస్య పరిష్కారం కావాలంటే రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కోసం వారంతా ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగుల పాలిట శాపంగా పీఎఫ్‌ఆర్‌డీఏ...
సీపీఎస్ విధానంలో ఉద్యోగుల మూల వేతనం, డీఏ సొమ్ములో 10 శాతాన్ని పెన్షన్ కోసం చెల్లించాలి. దీనికి ప్రభుత్వం కొంత సొమ్మును ఉద్యోగి ఖాతాకు జత చేస్తుంది. దీని కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) సంస్థను కేంద్రం తెరపైకి తెచ్చింది. 2013 సెప్టెంబరు 13న పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. ప్రతి సీపీఎస్ ఉద్యోగికీ ప్రాన్ అకౌంటు కేటాయించి దాని నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ ఖాతాలోని సొమ్మును షేర్ మార్కెట్‌లో పెడతారు. ఉద్యోగి రిటైర్మెంట్ రోజున ప్రాన్ ఖాతాలోని సొమ్ములో 60 శాతం మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం సొమ్మును ఆన్‌డ్యూటీ ప్లాన్‌లో పెట్టి సుమారు 6–9 శాతం రిటరన్స్‌తో పెన్షన్ చెల్లిస్తారు. ఈ పెన్షన్ మొత్తం ఏడాది మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత ఏడాది నుంచి షేర్ మార్కెట్ ఒడిదుడుకులను బట్టి నిర్ణయిస్తారు.
పోరాటాలు చేసిన వారిపై కేసులు పెట్టించిన చంద్రబాబు...
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ వి«ధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, మానవ హారాలు, కలెక్టరేట్ల ముట్టడి, ఆమరణ నిరాహారదీక్షలు నిర్వహించారు. చలో అమరావతి, చలో రాజధాని, చలో విజయవాడ వంటి పేర్లతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమస్యను పరిష్కరించకపోగా, శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టు చేయించారు. గృహ నిర్బంధాలతో ఇబ్బంది పెట్టారు. అక్రమ కేసులు పెట్టించి నరకం చూపించారు.
జిల్లా వ్యాప్తంగా 13 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు...
జిల్లా వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు 13,000 మంది ఉన్నారు. అందులో ఉపాధ్యాయులు 6 వేల మంది, పోలీసులు 3,500 మంది, 58 విభాగాలకు చెందిన గజిటెడ్, నాన్ గజిటెడ్ ఉద్యోగులు 3,500 మంది వరకు ఉన్నారు.
పాత పింఛన్ పద్ధతే మేలు
సీపీఎస్ విధానం కంటే పాత పెన్షన్ విధానమే ప్రయోజనకరంగా ఉంటుందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. పాత పింఛన్ విధానమే జీవితానికి భరోసా కల్పించగలదని మా అభిప్రాయం. రిటైర్మెంట్ తర్యాత వృద్ధాప్యంలో పెన్షన్ వస్తే ఆసరాగా ఉంటుంది.
– వనమా పుష్పరాజ్, స్కూల్ అసిస్టెంట్, పర్చూరు
సీపీఎస్‌తో ఉద్యోగులకు అన్యాయమే
సీపీఎస్ విధానం అమలు చేస్తే ఉద్యోగ విరమణ తర్యాత చాలా నష్టపోతారు. విశ్రాంత జీవితాన్ని సక్రమంగా గడిపే పరిస్థితి ఉండదు. సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం బాధాకరం.
– చింతా సుకన్య, తెలుగు పండిట్
ఉద్యోగానికి భద్రత లేదు
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం పొందినా భద్రత మాత్రం కరువే. ఐదేళ్ల పాలన చేసే రాజకీయ నాయకులకు ఉన్న పెన్షన్ సౌకర్యం 30 ఏళ్ల పాటు సేవలందించిన వారికి లేకపోవడం దురదృష్టకరం. సీపీఎస్ రద్దుకు ఐదేళ్ల నుంచి పోరాటాలు చేసినా టీడీపీ ప్రభుత్వం కమిటీ వేసి మిన్నకుండటం విచారకరం.
– శివకృష్ణ, సీపీఎస్ నాయకుడు, మార్కాపురం
పోరాటాలు, చేసినా ఫలితం లేదు
సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ శాఖ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు పోరాటాలు, ధర్నాలు, పాదయాత్రలు చేసినా ఫలితం లేదు. ఇప్పటికీ యూటీఎఫ్ శాఖ సీపీఎస్ రద్దు కోరుతూ పోరాడుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల ద్వారా కాలయాపన చేస్తోంది.
– మహ్మద్ జహీరుద్దీన్, యూటీఎఫ్, కుటుంబ సంక్షేమ పథకం డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment