నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు | control crime Special actions | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

Published Mon, Mar 9 2015 1:30 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

control crime Special actions

ప్రతి పోలీస్ స్టేషన్‌లో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించాలి
  ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
  లాడ్జిల్లో దిగే వారి పూర్తివివరాలు సేకరించాకే అద్దెకు ఇవ్వాలి
  విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం

 
 విజయనగరం డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ పీవీ రత్నం తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలీస్‌స్టేష న్లలో గ్రీవెన్స్‌సెల్, సీసీ కెమెరాలతో నిఘా వంటి వాటిపై ఆమె ‘సాక్షి’తో ఇలా మాట్లాడారు....
 - విజయనగరం క్రైం
 
 
 సాక్షి:  దొంగతనాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
 డీఎస్పీ: పది రోజుల క్రితం విజయనగరం పట్టణంలో చైన్‌స్నాచింగ్, కొద్దిగా ఇళ్ల దొంగతనాలు జరిగాయి. వన్‌టౌన్ పరిధిలోనే 17 బీట్‌లు ఏర్పాటు చేశాం. స్ట్రీట్ హాక్‌లు ఆరు తిరుగుతున్నాయి. ఎక్కువగా దొంగతనాలు జరిగే ప్రాంతాల్లో రాత్రి, పగలు బీట్‌లను వేశాం. రాత్రి వేళల్లో ప్రత్యేక టీమ్‌లు తిరుగుతుంటాయి. బైక్‌లపై వచ్చి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటిని నివారించేందుకు నిరంతరం వాహనాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. డివిజన్ పరిధిలో ప్రతి రోజు 300 వరకు వాహనాలను తనిఖీ చేసి కేసులను నమోదు చేస్తున్నాం.
 
 సాక్షి: పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టారా?
 డీఎస్పీ: పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. వారి కదలికలను ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న  క్రైం పార్టీ సిబ్బంది గమనిస్తూ ఉంటారు. బ్యాంకుల వద్ద, ఆలయాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశాం. గొలుసు దొంగతనాలు మహిళలనే లక్ష్యంగా చేసుకుని పాల్పడుతున్నారు. గొలుసు దొంగతనాలు ఎక్కువగా పాత నేరస్తులు పాల్పడే అవకాశం ఉంటుంది.
 
 సాక్షి: లాడ్జిలను దొంగలు ప్రధాన కేంద్రాలుగా వినియోగించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి?
 డీఎస్పీ: లాడ్జిలను ప్రతిరోజు సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అనుమానం వచ్చిన ప్రతిసారి కూడా లాడ్జిలను తనిఖీ చేస్తాం. లాడ్జిల్లో దిగేవారి పూర్తి వివరాలు తీసుకోవాలని లాడ్జిల యజమానులకు ఆదేశించాం. ఇతర రాష్ట్రాల నుంచి గ్యాంగ్‌లు వచ్చే సమయాల్లో లాడ్జిల్లోనే బస చేస్తారు. వారి బాష తదితరాలను బట్టి గుర్తించవచ్చు. అందుకే లాడ్జిల్లో దిగేవారి పూర్తి ఆధారాలు చూపించాక అద్దెకు ఇవ్వాలని ఆదేశిస్తున్నాం. లాడ్జిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పాం. సీసీ కెమెరాలు ఉంటే లాడ్జిల్లోకి ఎవరెవరు వస్తున్నారనే విషయాలు తెలుస్తాయి.
 
 సాక్షి: ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు స్టేషన్, సర్కిల్, డీఎస్పీ కార్యాలయ స్థాయిలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి?
 డీఎస్పీ: ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రతి సోమవారం డీఎస్పీ కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలో సీఐ, పోలీసు స్టేషన పరిధిలో ఎస్‌ఐలు గ్రీవెన్స్‌సెల్ నిర్వహించాలి. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలి. అక్కడ పరిష్కారం కాకుంటే ఎస్పీకు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
 
 సాక్షి: పట్టణంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని  నిర్ణయించారు. ఎప్పటిలో ఏర్పాటు చేస్తారు?
 డీఎస్పీ: పట్టణంలో నేరాల నియంత్రణకు ప్రధాన జంక్షన్‌లలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీసీ కెమెరాలను ప్రధాన జంక్షన్‌లో ఏర్పాటు చేస్తే నేరస్తులతోపాటు రోడ్డు ప్రమాదాల ఎలా జరిగాయనే విషయాలు తెలుస్తాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం
 
 సాక్షి: డివిజన్ పరిధిలో సిబ్బంది కొరత ఉందా?
 డీఎస్పీ: విజయనగరం డివిజన్ పరిధిలో పోలీసుస్టేషన్ వారీగా సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం పోలీసు రిక్రూట్‌మెంట్ జరగలేదు. సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లాం. పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటారు.
 
 సాక్షి: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
 డీఎస్పీ: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద స్థలాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలు గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement