లేడీస్ హాస్టల్ సంఘటనపై డీఎస్పీ విచారణ
– పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
నంద్యాల: పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీ లేడీస్ హాస్టల్‌లో శనివారం రాత్రి ఆగంతకులు జొరబడి విద్యార్థినిలను భయబ్రాంతులకు గురి చేసిన సంఘటన డీఎస్పీ హరినాథరెడ్డి విచారణ చేపట్టారు. సోమవారం ఆయన హాస్టల్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా నిచ్చారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా దేవనగర్‌కు చెందిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ఇద్దరు గతంలో పెట్రోల్ దొంగతనాలకు పాల్పడేవారని, జల్సా కోసం దొంగలుగా మారారని విచారణలో తెలుస్తోంది.
విద్యార్థి సంఘాల ఆగ్రహం.
లేడీస్ హాస్టల్‌లో జరిగిన సంఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు రఫీ, పీవైఎల్ డివిజన్ కార్యదర్శి గాలి రవిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి చిన్న, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాణి మాట్లాడుతూ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ హాస్టల్‌లో వాచ్‌మెన్‌ను నియమించకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందన్నారు.