సోషల్‌ మీడియాపై నియంత్రణా..? | control on social media is it right or wrong | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాపై నియంత్రణా..?

Published Fri, Apr 21 2017 11:37 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

సోషల్‌ మీడియాపై నియంత్రణా..? - Sakshi

సోషల్‌ మీడియాపై నియంత్రణా..?

కొన్నేళ్లుగా చర్చకు వస్తున్న అంశం... సోషల్‌ మీడియాపై నియంత్రణ. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాలు, తమకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై చట్టాన్ని ఆధారం చేసుకుని నియంత్రణా (నియంతృత్వ) చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో ఏపీ శాసన మండలిపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న అభియోగాలపై రవికిరణ్‌ అనే వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిజంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే అంశాలపై ప్రజలకు సరైన అవగాహన ఉందా..? ఈ విషయంలో చట్టం ఏం చెబుతోంది..? సోషల్‌ మీడియా వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

సోషల్‌ మీడియా అడ్మిన్‌ అరెస్టు..
ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిపై సోషల్‌ మీడియాలో అసత్య, అభ్యంతరకర ప్రచారం చేస్తున్నాడనే కారణంతో పొలిటికల్‌ పంచ్‌ అనే ఫేస్‌బుక్‌ పేజీ నిర్వాహకుడైన రవికిరణ్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ్‌ నాయక్‌ తెలిపారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘శాసనమండలి పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర ప్రచారం జరుగుతోందని అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దల సభను అసభ్యకరంగా చిత్రించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశాం. అక్కడి నుంచి తీసుకొచ్చిన అనంతరం, విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అసెంబ్లీని మార్ఫింగ్‌ చేస్తూ అడల్ట్‌ పిక్చర్‌ ఫోటోలను పోస్ట్‌ చేసినందుకు గాను అతని పై సెక్షన్‌ 67 ఐటీ యాక్ట్, ఐపీసీ 299 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశాం’ అన్నారు.   

రవికిరణ్‌ ఏం చేశాడు..?
ఇంటూరి రవికిరణ్‌ అనే వ్యక్తి పొలిటికల్‌ పంచ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఓ పేజ్‌ను నిర్వహిస్తున్నాడు. రాజకీయ అంశాలు, నేతలపై సెటైర్లు ఇందులో ఉంటాయి. కాగా సోషల్‌ మీడియాలో ఏపీ శాసన మండలిలో అసభ్యకర ప్రచారం జరుగుతోందని అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు పొలిటికల్‌ పంచ్‌ నిర్వాహకుడు రవికిరణ్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.

గతంలో సంఘటనలు..
► 2012లో శివసేన అధినేత బాల్‌థాక్రే మరణించిన సందర్భంగా ముంబైలో బంద్‌ పాటించారు. ఓ వ్యక్తి మరణించినంత మాత్రాన బంద్‌ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని ఓ యువతి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. మరో యువతి దీనికి లైక్‌ కొట్టింది. దీంతో బంద్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌ చేసినందుకు వారిద్దరినీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ యువతుల అరెస్టుపై పెద్ద దుమారమే రేగింది. చాలా మంది ప్రముఖులు ఈ అరెస్టులను ఖండించారు. అప్పటి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మార్కండేయ ఖట్జూ కూడా అరెస్టును తీవ్రంగా తప్పుబట్టారు.

► 2012 ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శిస్తూ ఉన్న ఓ కార్టూన్‌ను అంబికేష్‌ మహాపాత్ర అనే ఓ ప్రొఫెసర్‌ తన స్నేహితుడికి షేర్‌ చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు అంబికేష్‌ని, అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు.  సోషల్‌ మీడియాలో చేసిన పోస్టుల ఆధారంగా అంబికేష్‌ను అరెస్టు చేయడాన్ని కలకత్తా కోర్టు తప్పుబట్టింది. నిందితులపై కేసు కొట్టివేయడంతోపాటు, చెరో రూ.50 వేలను నష్టపరిహారంగా అందజేయాలని మమత ప్రభుత్వానికి సూచించింది.

సెక్షన్‌ 66 (ఎ) రద్దు..
సోషల్‌ మీడియా ద్వారా, వెబ్‌సైట్లలో అభ్యంతరకర అంశాల్ని ప్రచారం చేస్తే గతంలో 66 (ఎ)–2008 చట్టప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండేది. అయితే రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ సెక్షన్‌ రాజ్యాంగ వ్యతిరేకమని, పౌరుల భావవ్యక్తీకరణ హక్కును ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పౌరుల భావవ్యక్తీకరణ హక్కును సెక్షన్‌ 66(ఎ) నిరోధిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సెక్షన్‌పై గతంలో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ 2012లో తొలిసారి న్యాయ విద్యార్థిని శ్రేయ సింఘాల్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. శివసేన అధినేత బాల్‌ఠాక్రే చనిపోయినప్పుడు ముంబైలో బంద్‌ పాటించడంపై ఓ విద్యార్థిని ఫేస్‌బుక్‌లో వ్యతిరేకతను వ్యక్తంచేసింది. ఈ కామెంట్‌కు మరొకరు లైక్‌ కొట్టడంతో నేరంగా పరిగణించి వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో ఈ సెక్షన్‌ను సవరించాలని శ్రేయ తన పిటిషన్‌లో కోర్టును కోరింది. అంతేకాకుండా పౌరుల భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి సెక్షన్లను రద్దుచేయాలని కూడా ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేసింది. శ్రేయ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తుదితీర్పును వెలువరించింది.

జాగ్రత్తలేంటి..!
► గత సంఘటనల్లో ప్రభుత్వాలు చేసిన అరెస్టులను కోర్టులు తప్పుబట్టాయి. సోషల్‌ మీడియాలో వారు చేసిన పోస్టుల ఆధారంగా అరెస్టు చేయడాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని కోర్టులు వ్యాఖ్యానించాయి.
► అలాగని ఏది పోస్టు చేసినా శిక్ష నుంచి తప్పించుకోవచ్చనుకుంటే పొరపాటే.
► అందుకే సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న పోస్టింగులపై అవగాహన ఉండాలి. వాట్సప్‌నకు సంబంధించి ఏ గ్రూప్‌లో అభ్యంతరకర అంశం పోస్ట్‌ చేసినా, దానికి అడ్మినిస్ట్రేటర్‌దే బాధ్యత. అనుచిత పోస్టులు చేసే వారిని గ్రూపు నుంచి తొలగించాలి. అవసరమైతే అనుచిత పోస్టుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
► ఇక ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్‌ మీడియా వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మతాలను కించపరిచేలా, వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలాంటి పోస్టులకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
► భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగపరచకుండానే సోషల్‌ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవాలి.
► సమాజంలో ఉద్రిక్తతలు పెంచే, ఘర్షణలు తలెత్తే పోస్టులు చేయకుండా ఉండడమే మేలు.
► అసత్యపు ప్రచారాలతో కూడిన పోస్టులు షేర్‌ చేయకూడదు.
► ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు సోషల్‌ మీడియాని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అప్రమత్తతతో, అవగాహనతో మసలుకోవడం తప్పనిసరి.

 – సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement