మంత్రి పదవికి లోకేశ్ అనర్హుడు: అంబటి
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. సోషల్ మీడియా ఫిప్త్ ఎస్టేట్‌గా మారిందని, దాన్ని అణచివేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అయితే సోషల్ మీడియాలో అన్ని నిజాలే ఉంటాయని తాను అనడం లేదని, అయితే వాస్తవాలకు దగ్గరకు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారన్నారు.
మంత్రి పదవికి లోకేశ్ అనర్హుడని, పరిజ్ఞానం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. విమర్శలు చేసినంత మాత్రాన పొలిటికల్ పంచ్ రవికిరణ్‌ను అరెస్ట్ చేశారా అని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. అసలు రవికిరణ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని, కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదని, దీనిపై పోలీసులపై కూడా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
అరెస్ట్‌లు చేసేకంటే లోకేశ్‌కు ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తే మంచిదని సూచించారు. పరిణితి లేని వ్యక్తిని తీసుకువచ్చి మూడు శాఖలకు మంత్రిని చేస్తే... పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. లోకేశ్‌కు మంత్రి స్థాయిలేదని, అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్ ఏం చెబితే అది చేయాలనే మైండ్‌సెట్‌తో పోలీసులు ఉన్నారని, ఆ పద్ధతి మార్చుకోవాలన్నారు. అభద్రతా భావంతో ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు అందరూ సోషల్ మీడియావైపు చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. మీడియాను కంట్రోల్ చేయాలని చూడటం సరికాదని అన్నారు.